రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించడంపై కాంగ్రెస్ చీఫ్ ఏమన్నారంటే..
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తాము అయోధ్య పర్యటనను బహిష్కరించడం లేదని.. ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవాన్ని మాత్రమే బహిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో మత విశ్వాసాలను కించపర్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘‘ఏ మతాన్ని.. ఏ గురువును బాధపెట్టాలనేది మా ఉద్దేశం కాదు. ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రధానమంత్రి ఏం చేస్తున్నారనేది మా ప్రశ్న. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. పేద ప్రజల కోసం ప్రధాని ఏం చేస్తున్నారు?’’ అని ఖర్గే పేర్కొన్నారు. ‘‘విశ్వాసం ఉన్నవారు ఈరోజు ఆలయానికి వెళ్లొచ్చు.. రేపు కూడా వెళ్లొచ్చు.. మతపరమైన మనోభావాలను మేం గౌరవిస్తాం. రామమందిర అంశాన్ని తరుచూ లేవనెత్తుతూ బీజేపీయే రాజకీయ కుట్రకు తెరతీస్తోంది’’ అని ఆయన తెలిపారు.