ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఎంత?
ఇండియా నుంచి అమెరికాకు మొబైల్ ఫోన్ల్ ఎగుమతులు ఇటీవల అత్యంత వేగంగా పెరిగాయి.
- రేపటి నుంచి బేస్ టారిఫ్‌లు అమలు
- ఏప్రిల్ 10 నుంచి పూర్తి టారిఫ్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 5 నుంచి అన్ని దేశాలపై బేస్ టారిఫ్ 10 శాతం అమలు చేయనున్నారు. గతంలో 2.5 శాతం మాత్రమే ఉన్న ఈ టారిఫ్‌ను ట్రంప్ 10 శాతానికి పెంచారు. ఇక ఇడియా సహా చైనా, ఈయూ, వియత్నం, శ్రీలకం, బంగ్లాదేశ్ వంటి చాలా దేశాలపై అదనంగా విధించిన టారిఫ్‌లు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌పై అమెరికా 27 శాతం టారిఫ్ విధించింది. ఇందులో 10 శాతం శనివారం నుంచి.. మిగిలిన 17 శాతం ఏప్రిల్ 10 నుంచి అమలు కానున్నాయి. అయితే భారత్‌పై విధించిన సుకాల వల్ల మిశ్రమ ఫలితమే తప్ప పెద్దగా ఎదరు దెబ్బ ఉండదని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. మరి ఇండియాలో ఏయే రంగాలపై ఈ టారిఫ్‌ల ప్రభావం ఉండబోతోందో మార్కెట్ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి.
ఇండియా నుంచి అమెరికాకు మొబైల్ ఫోన్ల్ ఎగుమతులు ఇటీవల అత్యంత వేగంగా పెరిగాయి. ఐఫోన్లను ఇండియాలో అసెంబ్లింగ్ చేయడం వల్ల ఈ ఎగుమతుల విలువ 6బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే టారిఫ్‌ల కారణంగా ఇప్పుడు ఐఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఐఫోన్లకు సంబంధించిన కాంపోనెంట్లను లోకల్‌గానే సేకరిస్తున్నా.. కొన్ని ముఖ్యమైన పరికరాలు మాత్రం చైనా, సౌత్ కొరియా, తైవాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఈ దేశాలపై అమెరికా అత్యధిక టారిఫ్‌లు విధించడం పెద్ద ఎదురు దెబ్బ కానుంది. ఇండియాలో అసెంబ్లింగ్ చేసిన ఐఫోన్ల ఎగుమతులు మందగించే అవకాశం ఉంది. అంతే కాకుండా లోకల్ కాంపోనెంట్ సప్లయర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. 2023-24లో ఇండియా నుంచి ఎగుమతైన ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్ల వాటా 14 శాతంగా ఉంది. అయితే థాయిలాండ్, వియత్నాంలపై వేసిన అధిక సుంకాల వల్ల ఈ రంగంలో ఇండియా మున్ముందు మరిన్ని అవకాశాలు సృష్టించుకునే అవకాశం ఉంది.
అమెరికాకు ఎగుమతి అవుతున్న రత్నాలు, ఆభరణాలు, ముత్యాల్లో 30 శాతం వాటి ఇండియాదే. ఇప్పటికే ఈ రంగం అధిక టారిఫ్‌లతో సతమతం అవుతోంది. మరి కొత్తగా విధించే 26 శాతం టారిఫ్ తప్పకుండా ఈ రంగానికి పెద్ద ఎదురు దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. రత్నాలు, ఆభరణాలు భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతాయి. ఇండియాలోని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్, టైటాన్, కల్యాన్ జ్యూవెలర్స్, ట్రిభువన్‌దాస్ భీమ్‌జీ ఝవేరీ వంటి కంపెనీలు అత్యధికంగా ఎగుమతులు కలిగి ఉన్నాయి.
ఇండియాను ఫార్మా హబ్‌గా పిలుస్తారు. ఇక్కడి నుంచి అత్యధికంగా ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతానికి ఫార్మా రంగంపై పరస్పర సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే భవిష్యత్‌లో ఫార్మాపై సెక్టోరియల్ ట్యాక్స్ విధించే అవకాశం ఉంది. భారత్ ఎగుమతుల్లో 10 శాతం ఫార్మా రంగానికి చెందినవే ఉన్నాయి. లుపిన్, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, గ్లాండ్ ఫార్మా వంటివి అత్యధికంగా ఫార్మా ప్రొడక్ట్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. అమెరికాకు జెనరిక్ మెడిసిన్ ఎగుమతిలో అతిపెద్ద వాటా ఇండియాదే.
వస్త్రాలు, దుస్తుల ఎగుమతి రంగంలో భారత్ అతిపెద్ద వాటా కలిగి ఉంది. అయితే ఇండియాకు బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, థాయిలాండ్, శ్రీలంక నుంచి ఈ రంగంలో పోటీ ఉంది. అయితే మిగిలిన దేశాలన్నింటిపై అమెరికా అత్యధిక టారిఫ్‌లు విధించింది. దీంతో ఇండియా దీన్ని అవకాశంగా తీసుకొని అమెరికాలో అత్యధిక మార్కెట్ షేర్‌ను కొల్లగొట్టే అవకాశం ఉంది. గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, అర్వింద్ వంటి సంస్థలు భారీగా అమెరికాకు వస్త్రాలు, దుస్తులు ఎగుమతి చేస్తున్నాయి. ఇండియా నుంచి ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ భారం కానుంది. దీంతో పాటు ఆటో కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్లు కూడా నష్టపోయే అవకాశం ఉంది.