Thackeray Family :ఉద్ధవ్ థాక్రేకు తీపి కబురు.. రాజ్ థాక్రేకు చేదు కబురు
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్‌థాక్రే వారసులకు(Thackeray Family) ప్రత్యేక స్థానం ఉంటుంది.
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్‌థాక్రే వారసులకు(Thackeray Family) ప్రత్యేక స్థానం ఉంటుంది. బాల్ థాక్రే స్థాపించిన శివసేన (ఉద్ధవ్) పార్టీని ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే లీడ్ చేస్తున్నారు. బాల్ థాక్రే సోదరుడి కుమారుడు రాజ్ థాక్రే సైతం మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరుతో ప్రత్యేక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. ఈ రెండు కుటుంబాల నుంచి ఈసారి ముగ్గురు పోటీ చేశారు. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే (శివసేన - ఉద్ధవ్) ముంబైలోని వర్లీ స్థానం నుంచి గెలిచారు. ఇక్కడ ఆదిత్య(Aaditya Thackeray)కు ప్రధానంగా ఏక్‌నాథ్ షిండేే వర్గం శివసేన అభ్యర్థి మిలింద్ దేవర బలమైన పోటీ ఇచ్చారు. చివరకు 8,801 ఓట్ల తేడాతో ఆదిత్యను విజయం వరించింది.
ఉద్ధవ్ థాక్రే సమీప బంధువు వరుణ్ సతీశ్ సర్దేశాయ్ (శివసేన - ఉద్ధవ్) ముంబైలోని వాంద్రే ఈస్ట్ స్థానం నుంచి విజయఢంకా మోగించారు. ఇక్కడ వరుణ్(Varun Sardesai)కు ప్రధానంగా అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ అభ్యర్థి జీషాన్ సిద్దిఖీ నుంచి పోటీ లభించింది. దాదాపు 11వేల ఓట్ల తేడాతో వరుణ్ గెలిచారు. ఎంఎన్ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే కుమారుడు అమిత్ థాక్రే(Amit Thackeray) ముంబైలోని మాహిం స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ ఉద్ధవ్ శివసేనకు చెందిన మహేశ్ సావంత్‌కు అమిత్ థాక్రే టఫ్ ఫైట్ ఇచ్చారు. అయితే 1,300 ఓట్ల తేడాతో మహేశ్ సావంత్ గెలిచారు. అమిత్ థాక్రే మూడో స్థానంలో నిలవగా, షిండే శివసేనకు చెందిన సదా సర్వాంకర్ రెండో స్థానం సాధించారు.