ఆధార్ కార్డులు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
ఆధార్ కార్డు.. భారత పౌరులకు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఆధార్ కార్డు.. భారత పౌరులకు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. పిల్లలను స్కూల్లో చేర్చుకోవడం, బ్యాంకు ఖాతా తెరవడం, ప్రయాణ సమయంలో, హోటల్ బుకింగ్, ఆస్తులు కొనుగోలు చేయడం, మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. సామాన్యులు ప్రభుత్వ పథకాలకి అర్హులు కావాలన్ని ఆధార్ కార్డు కావాల్సిందే. ఆధార్ లేనిదే ఏ పని జరగదు. ఇక ఆధార్ కార్డుల్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)జారీ చేస్తుంటుంది. అయితే, UIDAI జారీ చేసే ఆధార్ కార్డు నాలుగు రకాలుగా ఉంటాయని చాలామందికి తెలియదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందా.
* ఆధార్ లెటర్ (Aadhaar Letter)
ఆధార్ లెటర్.. లామినేటెడ్ పేపర్. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ తరహా కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని పౌరులందరికి UIDAI సాధారణ పోస్టు ద్వారా ఇంటికి పంపుతుంది. ఈ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డుకు లింక్ చేసిన ఫోన్ నంబరుకు వచ్చే OTP ద్వారా మాత్రమే చేసుకోవచ్చు.
* ఎం-ఆధార్ కార్డ్(m Aadhaar)
ఎం-ఆధార్ కార్డ్ అనేది ఒక మొబైల్ యాప్. దీని ద్వారా మన ఆధార్ కార్డును సాఫ్ట్ కాపీ రూపంలో పొందెందుకు UIDAI ఎం-ఆధార్‌ను రూపొందించింది. ఇందులో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, iOS నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఆధార్ వివరాలను నమోదు చేసి మీ ఆధార్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఎలాంటి అప్‌డేట్ చేసినా, mAadhaar కార్డ్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది.
* ఆధార్ పీవీసీ కార్డు (Aadhaar PVC Card)
ఈ ఆధార్ కార్డులను UIDAI తాజాగా ప్రవేశపెట్టింది. ఇక పీవీసీ ఆధార్ కార్డ్ ప్రత్యేక ఆర్డర్ ద్వారా తయారు చేస్తారు. ఇందులో డిజిటల్‌గా సంతకం చేసిన ఆధార్ సెక్యూర్ కోడ్, ఫోటోగ్రాఫ్, డెమొగ్రాఫిక్ వివరాలు, మల్టిపుల్ సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. కేవలం రూ.50 ఫీజు చెల్లించి UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డును ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన 5 నుంచి 6 రోజులలోపు ఈ కార్డ్ మీ చిరునామాకు చేరుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ కార్డు నీటిలో తడవదు, చిరిగిపోదు.
* ఈ-ఆధార్ కార్డ్(E-Aadhaar Card)
ఈ-ఆధార్ కార్డు అనేది ఎలక్ట్రానిక్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ కార్డులో సురక్షితమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిని UIDAI అధికారిక వెబ్ సైట్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. ఆధార్ కార్డ్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఈ విధంగా UIDAI పాస్‌వర్డును ఏర్పాటు చేస్తుంది. ఈ కార్డ్‌లో చివరి నాలుగు సంఖ్యలు మాత్రమే పేర్కొంటారు. దీంతో మీ ఆధార్ కార్డు డేటా దొంగిలించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఫిజికల్ ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది.