అమ్మాయి చేయి పట్టుకుంటే తప్పు కాదు.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా ప్రేమను వ్యక్త పరిచేందుకు అమ్మాయి చేయి పట్టుకుంటే తప్పుకాదని, లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా వెల్లడించింది.
ముంబై: ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా ప్రేమను వ్యక్త పరిచేందుకు అమ్మాయి చేయి పట్టుకుంటే తప్పుకాదని, లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ సైతం ఇచ్చింది. ధన్‌రాజ్ అనే ఓ ఆటో డ్రైవర్ తన మైనర్(17ఏళ్లు) కూతురిని లైంగికంగా వేధించాడంటూ బాధితురాలి తండ్రి గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురును ట్యూషన్‌కు, స్కూల్‌కు తన ఆటోలో తీసుకెళ్లే ధన్‌రాజ్.. ఓ రోజు ఆమె చేయి పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో ధన్‌రాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం ధన్‌రాజ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, జరిగిన విషయాన్ని వివరించారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం తాజాగా విచారిస్తూ, ధన్‌రాజ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి జస్టిస్ భారతి డాంగ్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ధన్‌రాజ్‌పై మోపిన ఆరోపణను బట్టి, నిందితుడు లైంగిక ఉద్దేశంతో ఆమె చేయి పట్టుకున్నారనడానికి ఆధారాలు లేవు.
బాధిత బాలిక వాంగ్మూలంలోనూ ధన్‌రాజ్‌కు లైంగిక ఉద్దేశం ఉన్నట్టు కనిపించలేదు. ఆమె పట్ల తన ఇష్టాన్ని మాత్రమే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి, అతను అరెస్టు నుంచి రక్షణకు అర్హుడు. నిందితుడికి కస్టడీ అవసరం లేదు’ అని వెల్లడించారు. ఇదే సమయంలో, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తామని నిందితుడిని హెచ్చరించారు.