కాంగ్రెస్ మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’లో ఏమున్నాయో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు 48 పేజీల ‘న్యాయ్ పత్ర’ పేరిట బుక్‌లెట్‌ను రిలీజ్ చేశారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాల ప్రాతిపదికన దీన్ని రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం తెలిపారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసమే జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.‘‘గత యూపీఏ ప్రభుత్వం 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చింది. 2024లో అధికారం చేపట్టాక మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తాం’’ అని చిదంబరం చెప్పారు.
‘న్యాయ్’ల గురించి వివరించిన ఖర్గే..
కాంగ్రెస్ మేనిఫెస్టోను దేశంలోని పేద ప్రజలకు అంకితం చేస్తున్నామని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా వీటిని ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో రాహుల్ గాంధీ అందిస్తామన్న ఐదు న్యాయ్‌ల గురించి, 25 గ్యారంటీల గురించి న్యాయ పత్రాలలో ప్రస్తావన ఉందన్నారు. ‘‘యువ న్యాయ్ కింద ప్రతి విద్యావంతుడికి అప్రెంటిస్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తాం. దీని కోసం ఒక్కొక్కరిపై రూ.లక్ష వెచ్చిస్తాం. మహిళా న్యాయ్ కింద పేదింటి ఆడవారికి ఏటా రూ.లక్ష సాయం అందిస్తాం. కిసాన్ న్యాయ్ కింద రైతులకు రుణమాఫీ చేస్తాం. పంటలకు కనీస మద్దతు ధరలను కల్పించే చట్టాన్ని చేస్తాం. శ్రామిక్ న్యాయ్ కింద ఉపాధి హామీ పథకంలో కనీసం రూ.400 వేతనం ఇస్తాం. హిస్సేదార్ న్యాయ్‌లో భాగంగా సామాజిక, ఆర్థిక సమానతల కోసం జాతీయ జనగణన చేపడతాం. ‘రక్షా న్యాయ్’ కింద విదేశీ వ్యవహారాల్లో కూడా మార్పులు తీసుకొస్తాం’’ అని న్యాయ్‌ల గురించి ఖర్గే వివరించారు. తాము అమలు చేయగలిగే అంశాలనే మేనిఫెస్టోలో చేర్చామని స్పష్టం చేశారు. ‘‘విపక్ష నేతలను ప్రధాని మోడీ జైళ్లలో పెట్టిస్తున్నారు. మా పార్టీపై రూ.3,500 కోట్ల జరిమానాలు విధించారు. ఇప్పుడు మాపై జరిగినవి.. రేపు మీడియాపైనా జరగొచ్చు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోడీని గద్దె దించాలి. ప్రధాని భయపడి ఇప్పటివరకు మణిపూర్‌కు వెళ్లలేదు.. మా నేత రాహుల్ అక్కడికి వెళ్లారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరు’’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని కీలక హామీలు
* అగ్నిపథ్ పథకం రద్దు
* జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా
* రైట్ టు అప్రెంటిస్ చట్టం
* మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా రూ.లక్ష సాయం
* ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు
* మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాలు రద్దు. ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.
* మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాషలను పర్సనల్ లా ప్రకారం ఎంచుకొనే హక్కు ఇస్తాం
* తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టాన్ని సవరిస్తాం.
* దేశవ్యాప్తంగా కుల గణన.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు
* విద్యార్థులకు కూడా ఏటా లక్ష సాయం.
* రైతులకు రుణమాఫీ చేస్తారు.
* కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చి రైతుల ఆదాయాన్ని పెంచుతారు.
* వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గిస్తారు.
ఐదు న్యాయ్‌లు ఇవీ..
1.హిస్సేదారి న్యాయ్
* సామాజిక, ఆర్థిక కుల గణన
* ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్‌ల కల్పనపై 50 శాతం పరిమితి తొలగింపు
* ఎస్సీ ఎస్తీ సబ్ ప్లాన్ కోసం ప్రత్యేక బడ్జెట్
* అటవీ హక్కుల చట్టం క్లెయిమ్‌లను ఏడాదిలోగా పరిష్కరించే హామీ
* గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాగా గుర్తింపు
2.కిసాన్ న్యాయ్
ఈ హామీ కింద రైతులను ఆదుకునే లక్ష్యంతో కాంగ్రెస్ సమగ్ర ప్యాకేజీని ప్రకటించింది.
* స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించడం
* రుణమాఫీ కమిషన్ ఏర్పాటు
* పంట నష్టానికి 30 రోజుల్లో బీమా పరిహారం ఇచ్చే గ్యారెంటీ
* రైతుల లబ్దికి ఎగుమతి-దిగుమతి విధానం
* వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు
3.శ్రామిక్ న్యాయ్
* రైట్ టు హెల్త్ చట్టం
* ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఉన్న కార్మికులందరినీ కలుపుకొని రోజుకు రూ. 400 కనీస వేతనం
* పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు
* అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా కవరేజీ
* ప్రభుత్వంలోని కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలను నిలిపేయడం
4.యువ న్యాయ్
* కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ
* యువతకు ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్
* పేపర్ లీక్‌ను అరికట్టడానికి కఠినమైన చట్టం
* గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు
* స్టార్టప్ ఫండ్ ఏర్పాటుకు హామీ
5.నారీ న్యాయ్
* ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి రూ. 1 లక్ష హామీ
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
* ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడం కోసం రెట్టింపు జీతం
* మహిళల హక్కుల రక్షణకు అధికారి మైత్రీ ఏర్పాటు
* వర్కింగ్ ఉమెన్ కోసం సావిత్రిబాయి పూలె పేరుతో రెట్టింపు హాస్టల్స్
మేనిఫెస్టోలోని 10 ఛాప్టర్లలో..
ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం 10 ఛాప్టర్లు ఉన్నాయి. సమానత్వం, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, రాజ్యాంగ పరిరక్షణ, ఆర్థిక వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ, జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలను ఈ ఛాప్టర్లలో ప్రస్తావించారు. మొత్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల ఫొటోలను హైలైట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న ఒక ఫొటోను మేనిఫెస్టో బుక్ లెట్ చివరి పేజీలో పెట్టి.. దానిపై ‘హాత్ బద్లేగా హాలాత్’ అనే నినాదాన్ని పబ్లిష్ చేశారు. చివరి పేజీ కంటే ముందున్న ఓ పేజీలో సోనియాగాంధీ నవ్వుతున్న ఫొటోను పబ్లిష్ చేశారు.