Hemanth soren: హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట..ఈడీ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో ఆయనకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో ఆయనకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జార్ఖండ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ న్యాయంగా ఉన్నట్టు కనిపిస్తోందని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు తీర్పు మంచి నిర్ణయమని, న్యాయమూర్తి లాజికల్ తీర్పు ఇచ్చారని తెలిపింది. దీనిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు వ్యాఖ్యలు విచారణపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది.
కాగా, భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన జూలై 4న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బెయిల్ ఆర్డర్ చట్టవిరుద్ధమని, పక్షపాతంతో కూడుకున్నదని ఆరోపిస్తూ.. హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈడీ జూలై 8న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.