Heatwave: ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో హీట్ వేవ్.. ఐఎండీ వార్నింగ్
ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అంతేగాక మధ్య, తూర్పు భారతదేశం, వాయువ్య మైదానాలలో వేడి గాలులు వీస్తాయని తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర (Mahapathra) సోమవారం తెలిపారు. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. వాయువ్య భారతదేశంలో వేసవిలో వేడిగాలుల సంఖ్య రెట్టింపు కావొచ్చని తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని ఉత్తర ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఏప్రిల్ నెలలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. అయితే, దక్షిణ, వాయువ్య ప్రాంతాలలోని కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండొచ్చు. వాయువ్య, ఈశాన్యంలోని కొన్ని ప్రదేశాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని మహాపాత్ర చెప్పారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 9 నుండి 10 శాతం పెరిగే చాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.