Syria: సిరియా నుంచి స్వదేశానికి వచ్చిన నలుగురు భారతీయులు
సిరియాను(Syria) రెబల్స్ స్వాధీనం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళనల మధ్య అక్కడున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి రప్పిస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: సిరియాను(Syria) రెబల్స్ స్వాధీనం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళనల మధ్య అక్కడున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి రప్పిస్తోంది. కాగా.. శనివారం నలుగురు భారతీయులు ఢిల్లీ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. స్వదేశానికి చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సిరియాలోని ఇండియన్ ఎంబసీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అలానే, అక్కడున్న సమయంలో భయానక పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘‘రెండు వారాల క్రితం నేను సిరియా (Syria)కు వెళ్లాను. ఇలా ఉద్రిక్తతలు తలెత్తుతాయని అనుకోలేదు. భారత దౌత్య కార్యాలయం అక్కడినుంచి మమ్మల్ని లెబనాన్‌కు తరలించింది. ఉద్రిక్తతల వేళ విమానాలు లేకపోవడంతో బస్‌లో లెబనాన్‌కు వెళ్లాం. ఆ తర్వాత గోవా ఇప్పుడు ఢిల్లీకి వచ్చాం’’ అని ఒకరు తెలిపారు. ‘‘గత నాలుగు నెలలుగా నేను సిరియాలో ఉద్యోగం చేస్తున్నా. ఇటీవల తను ఉన్న ప్రాంతం సమీపంలోకి రాకెట్లు దూసుకొచ్చాయి. వెంటనే ఎంబసీకి సమాచారం ఇచ్చాను. అక్కడి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రతిరోజు రాకెట్లు, బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. మాకు ప్రతి దశలో సహకరించిన ఎంబసీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని ఇంకొకరు తెలిపారు. అలా రాకెట్లు, బుల్లెట్లు, పేలుళ్లు శబ్దాలతో భయపడిపోయినట్లు మరొకరు తెలిపారు.
సిరియానుంచి భారతీయుల తరలింపు
ఇకపోతే, సిరియా నుంచి ఇప్పటివరకు 77 మంది భారతీయులను తరలించినట్లు కేంద్రం తెలిపింది. పలు కారణాల వల్ల అక్కడ ఉన్న భారతీయులు తిరిగి రావాలనుకుంటే.. తగిన సదుపాయాలు కల్పిస్తామని తెలిపింది. సిరియాలో రెబల్స్ దాడులు చేసి, రాజధాని డమాస్కస్ తో పాటు పలు నగరాలను ఆక్రమించుకున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al Assad) దేశం విడిచి రష్యాకు పారిపోయారు. దీంతో, సిరియాలో రాజకీయ సంక్షోభం కూడా నెలకొంది.