Congress Manifesto : ఆ అన్నదాతలకు ‘అమరుల’ హోదా.. హర్యానా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలు

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే నెల 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

Update: 2024-09-28 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే నెల 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో రైతులు, మహిళలను ఆకట్టుకునే పలు ముఖ్యమైన హామీలు ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 736 మంది అన్నదాతలకు అమరుల హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వారి త్యాగాలకు గుర్తుగా నిలిచిపోయేలా ఒక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అమరులైన రైతుల కుటుంబాలకు చెందిన ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. అన్నదాతల సమస్యలపై అధ్యయనానికి రైతు సంక్షేమ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. రైతు డీజిల్ కార్డులను జారీ చేసి.. వాటి ద్వారా సన్నకారు రైతులకు డీజిల్ కొనుగోలుపై రాయితీలను అందిస్తామని తెలిపింది.

హర్యానా నుంచి సైన్యంలో పనిచేస్తూ అమరులైన వారి కుటుంబాలకు రూ.2 కోట్ల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశంతో పాటు పిల్లల చదువుకు ఆర్థికసాయం అందిస్తామని పేర్కొంది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు ప్రతీ కుటుంబం నుంచి 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగిన ఒక మహిళకు రూ.2వేల ఆర్థికసాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతినెలా రూ.6వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించింది. పేద కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపింది. హర్యానాలో 2 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పింది.


Similar News