మధుమేహం, గుండె జబ్బులతో సహా 41 ఔషధాల ధరలు తగ్గించిన ప్రభుత్వం
ధరలు తగ్గించిన ఔషధాల జాబితాలో యాంటిసిడ్స్, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్స్ వంటిని ఉన్నాయి
దిశ, నేషనల్ బ్యూరో: మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు సహా సాధారణంగా ఉపయోగించే 41 ఔషధాల ధరలను ప్రభుత్వం తగ్గించింది. అంతేకాకుండా ఆరు ఫార్ములేషన్స్ ధరలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మరియు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ధరలు తగ్గించిన ఔషధాల జాబితాలో యాంటిసిడ్స్, మల్టీవిటమిన్, యాంటీబయాటిక్స్ వంటిని ఉన్నాయి. ఈ సమాచారానికి సంబంధించి ధరల వివరాలను వెంటనే డీలర్లు, స్టాకిస్టులు అందించాలని ఫార్మా కంపెనీలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. నిత్యావసర ఔషధాలను ప్రజలకు అందుబాటు ధరలో ఉండేలా చూసేందుకు ఎన్‌పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ధరల తగ్గింపు ద్వారా దేశంలోని సుమారు 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రయోజనాలు పొందనున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా షుగర్ వ్యాధిగ్రస్తులున్న భారత్‌లో ఈ నిర్ణయం మరింత మేలు కల్పించనుంది. గత నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు సవరించిన వార్షిక సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.