ఫినోలెక్స్ కేబుల్స్ కేసు.. ఇద్దరు ఎన్‌సీఎల్ఏటీ సభ్యులకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులైన ఇద్దరికీ కోర్టు ధిక్కార కింద సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అక్టోబర్ 30న ఇద్దరు సభ్యులు తమ ఎదుట హాజరు కావాలని సీజేఐ ధర్మాసనం నోటీసుల్లో పేర్కొంది. ఫినోలెక్స్ కేబుల్స్ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ సభ్యుడు రాకేష్ కుమార్, టెక్నికల్ మెంబర్ అలోక్ శ్రీవాస్తవకు ధిక్కార నోటీసులు జారీ చేశారు. వారిపై సుప్రీంకోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నిస్తూ, అక్టోబర్ 30న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో ఈ నెల 13న 'స్టేటస్ కో' ఆదేశాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ, ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎన్‌సీఎల్ఏటీ జ్యుడిషియల్ సభ్యులు రాకేశ్, టెక్నికల్ మెంబర్ డా. అలోక్‌లు ఈ వ్యవహారంలో దాఖలైన అప్పీల్‌పై తీర్పు ఇచ్చారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తూ ఎన్‌సీఎల్ఏటీ సభ్యులకు నోటీసులిచ్చింది.
ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని ఎన్‌సీఎల్ఏటీ చైర్‌పర్శన్ జస్టిస్ అశోక్ భూషన్‌నూ ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాల గురించి తమకు తెలియదని వారు చెప్పిన దర్యాప్తు నివేదిక కోర్టుకు చేరగా, దాన్ని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాలు తెలిసి కూడా ఎన్‌సీఎల్ఏటీ తీర్పు ఇచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించాం. ఇద్దరు సభ్యులు అక్టోబర్ 30న తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది.