భారీ గుడ్‌న్యూస్.. నెలకు 10 కేజీల చొప్పున రేషన్: ఖర్గే కీలక ప్రకటన
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశలు ముగిశాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశలు ముగిశాయి. ఇంకా మూడు దశలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ఏఐసీసీ ఆధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రజలకు గుడ్‌న్యూస్ అందించారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలకు 5 కిలోలకు బదులుగా 10 కేజీల రేషన్ ఇస్తామని ప్రకటించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు. ఆహార భద్రత చట్టం మేమే తీసుకొచ్చామని ఖర్గే తెలిపారు.
కాగా ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 కేజీల రేషన్ ఇస్తామన్నారు. ఇప్పటికే కర్ణాటకలో, తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని అన్నారు. జూన్ 4వ తేదీన కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎలక్షన్స్ ఎంతో ముఖ్యమైనవని చెప్పుకొచ్చారు. నేను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానని, పేదల కోసం తన కూటమి ఎప్పటికీ పోరాటం చేస్తుందని, నేను పోరాట యోధుడ్ని కాబట్టే ఇంకా బతికి ఉన్నానని వెల్లడించారు.