Media : దోషులను నిర్ణయించడం మీడియా స్వేచ్ఛ కాదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : మీడియా సంస్థలు కంగారూ కోర్టుల్లా(kangaroo courts) వ్యవహరించకూడదని కేరళ హైకోర్టు(Kerala High Court) ధర్మాసనం హితవు పలికింది.
దిశ, నేషనల్ బ్యూరో : మీడియా సంస్థలు కంగారూ కోర్టుల్లా(kangaroo courts) వ్యవహరించకూడదని కేరళ హైకోర్టు(Kerala High Court) ధర్మాసనం హితవు పలికింది. కోర్టుల్లో విచారణ దశలో ఉన్న కేసుల్లోని నిందితులను దోషిగా లేదా నిర్దోషిగా చిత్రీకరించే హక్కు మీడియాకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘మీడియా(media) స్వేచ్ఛ పేరుతో వార్తా కథనాలను ఇష్టారాజ్యంగా ప్రచురించకూడదు. కేసుల తీర్పు వెలువడక ముందే.. దోషులను నిర్ణయించేలా మీడియా కథనాలు ఉండకూడదు’’ అని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. న్యాయ విచారణ దశలో ఉన్న కేసులపై ఇష్టానుసారంగా కథనాలు ప్రచురించకుండా మీడియాను కట్టడి చేయాలంటూ దాఖలైన మూడు పిటిషన్లను విచారించిన కేరళ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
‘‘ఆర్టికల్ 19(1)(ఎ) ద్వారా మీడియాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లభిస్తుంది. అయితే దాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా కథనాలను ప్రచురించ కూడదు. న్యాయ విచారణ జరుగుతుండగా.. దోషులను, నిర్దోషులను నిర్ధారించకూడదు. జడ్జీల పాత్రను మీడియా పోషించొద్దు. ఇష్టానుసారంగా కథనాలను ప్రచురిస్తే మీడియా విశ్వసనీయత దెబ్బతింటుంది. అలాంటి కథనాల వల్ల.. ఆయా కేసుల్లోని వ్యక్తులకు ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రైవసీ, డిగ్నిటీలకు విఘాతం కలుగుతుంది’’ అని ధర్మాసనం పేర్కొంది.