ఉగ్రనేతలకు భారత్ టెర్రర్.. సరిహద్దులు దాటి మరీ లేపేస్తున్నారు !
గత రెండేళ్లలో ఉగ్రనేతలు ఒక్కొక్కరూ పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్ తన వైఖరి మార్చుకున్నదా? ఉగ్రదాడులకు కుట్ర పన్నేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నదా? ఇందుకు అవసరమైతే సరిహద్దులు సైతం దాటుతున్నదా? అంటే గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. గత రెండేళ్లలో ఉగ్రనేతలు ఒక్కొక్కరూ పిట్టల్లా రాలిపోతున్నారు. పాక్, సహా పలు దేశాల్లో గతంలో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌ను వణికించిన ఉగ్రవాదులు/వేర్పాటువాదులు ఇప్పుడు కలుగులో దాగిన ఎలుకలు అయ్యారు. అడుగు బయటపెడితే ఎక్కడనుంచి బుల్లెట్లు దూసుకు వస్తాయోనని హడలిపోతున్నారు. నిజానికి ఖలిస్థాన్ మద్దతుదారు హర్దీప్సింగ్ నిజ్జార్‌ను భారత్ హత్య చేసిందని కెనడా ఆరోపణలు చేయడంతో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే, ఈ హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ కుండబద్దలు కొడుతున్నది. కానీ, వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఈ పని ఎవరు చేస్తున్నారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. పాక్ మాత్రం ఇదంతా భారత్ తన నిఘా సంస్థ ఆర్ అండ్ ఏడబ్ల్యా (రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్)తో చేయిస్తున్నదని ఇందుకు ముంబై మాఫియా డాన్లను వాడుకుంటున్నదని ఆరోపణలు చేస్తున్నది. కానీ, భారత్ మాత్రం ఇవన్నీ ఉత్త పుకార్లేనని కొట్టిపారేస్తున్నది. గతంలో ఇజ్రాయెల్ సైతం విదేశాల్లో తలదాచుకున్న తన శత్రువులను వెతికి వెతికి మరీ హతమార్చింది. ఇప్పుడు భారత్ కూడా ఆ రూట్లోనె వెళ్తున్నదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో హతమైన ఉగ్రవాదుల జాబితా ఇలా ఉన్నది.
అద్నాన్ అహ్మద్: లష్కరే తాయిబా టాప్ ర్యాంకింగ్ కమాండర్, 2015 ఆగస్టు 5న కశ్మీర్‌లోని ‘ఉధంపూర్ దాడి’తోపాటు బీఎస్ఎఫ్ జవాన్లపై జరిగిన పలు దాడులకు వ్యూహకర్త. గతేడాది డిసెంబర్ 3న ఇతన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. కరాచీలోని అతని ఇంటి బయట ఉండగా, రెండు దశల భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన అటాకర్స్.. తెల్లవారు జామున అద్నాన్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. తల, ఛాతీలోకి పలు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.
లఖ్బీర్ సింగ్ రోడ్: ఖలిస్థాన్ వేర్పాటువాది అయిన లఖ్బీర్ సింగ్ రోడ్(71)ను భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతను నిషేధిత ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్), ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్(ఐఎస్‌వైఎఫ్) అనే సంస్థలకు చీఫ్. పంజాబ్‌లోని మోగా అనే గ్రామంలో జన్మించిన లఖ్బీర్.. చాన్నాళ్ల కిందటే కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత అతనొక్కడే పాక్ వచ్చాడు. లఖ్బీర్ స్థాపించిన ఐఎస్‌వైఎఫ్.. అమెరికా, కెనడా, జర్మనీ, యూకేకూ విస్తరించింది. భారత్‌లోని వీవీఐపీలు, రాజకీయ నాయకులే లక్ష్యంగా చేసుకుని సరిహద్దుల గుండా పంజాబ్‌లోకి అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదర్థాలు రవాణా చేయించాడు. దేశంలో దాడులు చేసేందుకు పంజాబ్‌లో కొందరు గ్యాంగ్ స్టర్‌లను సైతం నియమించుకున్నాడని కేంద్రం వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 15న జలాలాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద ‘టిఫిన్ బాంబు’ పేలుడుకు వ్యూహకర్త. వీటితోపాటు పలు యాంటీ ఇండియా చర్యలకు పాల్పడిన లఖ్బీర్.. గతేడాది డిసెంబర్ 2న మృతిచెందాడు. గుండెపోటుతో చనిపోయాడని అతని సోదరుడు అకాల్ తక్త్ జతేదర్ తెలిపినప్పటికీ, లఖ్బీర్ మరణంపై మాత్రం పలు అనుమానాలు నెలకొన్నాయి.
అక్రమ్‌ఖాన్ అలియాస్ ఘాజీ: లష్కరే తాయిబా మాజీ కమాండర్, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంతో నిష్ణాతుడు. 2018 నుంచి 2020 వరకు భారీ సంఖ్యలో కశ్మీరీ యువతను ఉగ్రవాదంవైపు నడిపించాడు. ఆ తర్వాత భారత్‌పై విద్వేష ప్రసంగాలతో ఫేమస్ అయ్యాడు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో గతేడాది నవంబర్ 16న గుర్తు తెలియని వ్యక్తులు ఘాజీ కాల్చి చంపేశారు.
షాహిద్ లతీఫ్: 2016లో పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడికి కీలక సూత్రధారి, జైషే మొహమ్మద్ నాయకుడు షాహిద్ లతీఫ్. గతేడాది అక్టోబర్ 11న పాక్‌లోని సియాల్కోట్లో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపారు.
రియాజ్ అహ్మద్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్కోట్లో గతేడాది సెప్టెంబర్ 8న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసింగ్ హతమయ్యాడు. స్థానిక మజీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అతడిని గుర్తు తెలియని వ్యక్తి అతి సమీపంనుంచి కాల్చడంతో కూర్చున్నస్థితిలోనే ప్రాణాలు వదిలాడు. రాజౌరీ జిల్లాలో 1999లో జరిగిన ఢాంగ్రి ఉగ్రదాడి సహా ఆ ఏడాది జరిగిన అనేక పాక్ సీమాంతర ఉగ్ర దాడులకు రయాజ్ వ్యూహకర్త.
పరంజీత్ సింగ్ పంజ్వార్: పంజాబ్‌లో సమసిపోయిన సిక్కు ఉగ్రవాదాన్ని తిరిగి పురుడుపోయడానికి ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరంజీత్‌సింగ్ ప్రోత్సహిస్తున్నాడని భారత్ ఆరోపిస్తున్నది. డ్రగ్స్, కిడ్నాప్, ఆయుధ స్మగ్లింగ్ వంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పాక్ ఆశ్రయం పొంది.. కరాచీలో నివాసం ఉంటున్న పరంజీత్‌ను గతేడాది మార్చి 7న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సమీపంనుంచి కాల్చి చంపేశారు.
బషీర్ అహ్మద్ పీర్: జమ్మూ కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ.. దేశంలో ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్. గతేడాది ఫిబ్రవరి 21న పాక్‌లోని రావల్పిండి నగరంలోని ఓ షాప్ వద్ద వేచిచూస్తున్న బషీర్‌ను గుర్తు తెలియని వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
సయ్యద్ ఖాలిద్ రజా: భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అల్ బద్ర్ సంస్థకు ఖాలిద్ కమాండర్. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారకుడైన ఖాలిద్‌ను గతేడాది ఫిబ్రవరి 27న పాక్ రాజధాని కరాచీలో హతమార్చారు.
లాల్ మొహమ్మద్: భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రించి.. భారత్‌లో చలామణీ చేయడంలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ డార్జీది ప్రధాన భూమిక. నేపాల్‌లోని కాట్మాండూ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నాడు. అయితే, 2022, సెప్టెంబర్ 22న కాట్మాండూ శివారులో లాల్ కారులో ప్రయాణిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌తో అడ్డగించి.. తుపాకులతో కాల్చారు. ఈ ఘటనతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
మిస్త్రీ జహూర్ ఇబ్రహీం: భారత విమానం ఐసీ 814ను హైజాక్ చేసి ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌కు మళ్లించిన ఐదుగురు ఉగ్రవాదుల్లో మిస్త్రీ ఒకరు. ఆ సమయంలో ప్రయాణికుడి గొంతు కోసి హతమార్చిన ఇతడు.. పాక్ సైన్యం రక్షణలో కరాచీలో నివాసముంటున్నాడు. మార్చి 8, 2022న బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి.. మిస్త్రీని సమీపంనుంచి కాల్చి చంపాడు.
తృటిలో తప్పించుకున్నది వీరే..
మౌలానా మసూద్ అజర్: కాందహార్ విమాన హైజాకింగ్, పార్లమెంట్‌పై దాడి, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి సహా అనేక ఘటనలకు కారకుడు.. జైషే మొహమ్మద్ స్థాపకుడు మౌలానా మసూద్ అజర్. ఇతడిపై కూడా ఇదే తరహా దాడులు జరిగాయి. కానీ, తృటిలో తప్పించుకున్నాడు. పెషావర్ సమీపంలోని ఓ మదర్సాలో అజర్ తలదాచుకున్న సంగతి తెలిసి.. భారత్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయి. కానీ, సమయంలో తృటిలో తప్పించుకోగలిగాడు. అయితే, ఘటనతో నాలుగేళ్లుగా అజర్ ప్రజల్లోకి రాలేదు. పూర్తిగా రహస్య జీవితం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 2న దుండగుల బాంబు దాడిలో మరణించాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ, మసూజ్ మరణాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
హఫీజ్ సయీద్: జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ముంబై దాడులకు మాస్టర్ మైండ్. లాహోర్‌లోని పటిష్ఠ పోలీసు భద్రత నడుమ ఇతడి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు జూన్ 2021లో బాంబులతో పేల్చివేశారు. ఘటన సమయంలో సయీద్ అక్కడ లేకపోవడంతో తృటిలో తప్పించుకున్నాడు. కానీ, బందోబస్తులో పోలీసులు కొందరు చనిపోయారు. ఓ మతపరమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హఫీజ్ కొడుకు తల్హా సయీద్ లక్ష్యంగా ఓ బాంబు దాడి జరిగింది. అయితే, తీవ్రత తక్కువ ఉండటం.. బాంబు పేలిన ప్రాంతానికి కాస్త దూరంగా తల్హా ఉండటంతో ప్రాణపాయం తప్పింది. ప్రస్తుతం అతను పాక్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవలే వెల్లడించింది.