పాక్ మాజీ చీఫ్ జనరల్‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు..
పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. బజ్వా సూచనతోనే తాను పంజాబ్, ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేశానని చెప్పారు. ఎన్నికలు కావాలంటే ఆ రెండు అసెంబ్లీలను రద్దు చేయాలని బజ్వా సలహా ఇచ్చినట్లు తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు కూడా అయిన ఇమ్రాన్ తెలిపారు. షెహబాజ్ షరీఫ్ ను అధికారంలోకి తెచ్చేందుకు బజ్వా తీవ్రంగా ప్రయత్నించారని ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తనకు చెప్పారని పేర్కొన్నారు.
షెహబాజ్, ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న కొందరు నాయకులు దేశ ఖజానాను విదేశాలకు తరలించారని, ఈ విషయం తెలిసినా తన పదవిని పొడిగించుకోవాలనే స్వార్ధంతో బజ్వా మిన్నకుండిపోయారని ఇమ్రాన్ ఆరోపించారు. షెహబాజ్ పార్లమెంటును రద్దు చేస్తే జూలైలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంటు ఎన్నికలతో కలిపి అక్టోబర్ లో నిర్వహించాలనుకున్న షెహబాజ్ ప్రభుత్వ కుట్రను సుప్రీం కోర్టు భగ్నం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. పంజాబ్ ఎన్నికలను మే 14వ తేదీన నిర్వహించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని ప్రభుత్వం పాటించేలా తమ పార్టీ ఒత్తిడి తెస్తుందని, ఎన్ని కలను ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేసే అవకాశం ఇవ్వదని ఇమ్రాన్ స్పష్టం చేశారు.