తొలిసారిగా జైళ్లలో ఖైదీల కోసం ఏకాంత గదులు.. ఎక్కడంటే?

నేరాలకు పాల్పడి శిక్ష పడిన ఖైదీలు (Prisoners) జైలులో (Prison) కఠిన నియమాలు అనుసరించాల్సి ఉంటుంది.

Update: 2025-04-19 07:51 GMT
తొలిసారిగా జైళ్లలో ఖైదీల కోసం ఏకాంత గదులు.. ఎక్కడంటే?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: నేరాలకు పాల్పడి శిక్ష పడిన ఖైదీలు (Prisoners) జైలులో (Prison) కఠిన నియమాలు అనుసరించాల్సి ఉంటుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య శిక్ష అనుభవించాలి. ఈ క్రమంలో ఖైదీలు స్రత్పవర్తన అలవరుచుకుని శిక్షా కాలం అనంతరం సమాజంలో క్రమ శిక్షణ, స్వయం సాధికారత, ఆర్థిక స్వావలంబనతో ముందడుగు వేసేలా కొన్ని జైళ్లు ఖైదీలను తీర్చిదిద్దుతోన్నాయి. ఇందులో భాగంగానే ఖైదీల సంక్షేమం, కుటుంబ హక్కుల పరిరక్షణ దిశగా ఇటలీ (Italy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా జైళ్లలో ఖైదీల కోసం ఏకాంత గదులను (Private Rooms for Prisoners) అందుబాటులోకి తెచ్చింది. ములాఖత్ సమయంలో ఖైదీలను కలిసేందుకు వచ్చిన తమ భాగస్వాములతో ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. గతేడాది కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సెంట్రల్‌ ఉంబ్రియా ప్రాంతంలోని జైలు (Jail)లో ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలంటూ ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని తీర్పు ఇచ్చింది. వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను ఆదేశించింది. ఖైదీలు తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలని పేర్కొంది. యూరోపియన్ దేశాల్లో చాలా వరకూ ఖైదీల కోసం ఏకాంత గదులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. 

కాగా, ఇటలీలో 62 వేల మంది ఖైదీలు వివిధ నేరాల్లో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సంఖ్య జైళ్ల గరిష్ఠ సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక, గత కొంతకాలంగా ఖైదీలు మానసిక ఒత్తిడులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య ఘటనలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఇప్పటికే అక్కడి అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఖైదీలు తమ కుటుంబసభ్యులకు ఎక్కువ సార్లు ఫోన్‌ చేసుకునే వీలు కల్పించారు. తాజాగా భాగస్వాములతో ఏకాంతంగా కలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 

Tags:    

Similar News