గల్వాన్ ఘర్షణతో లెక్క మారింది.. చైనా చేష్టల వల్లే రక్తపాతం : భారత్

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిణామాలు చకచకా మారుతున్నాయి.

Update: 2024-03-09 16:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిణామాలు చకచకా మారుతున్నాయి. చైనా బార్డర్‌ ఏరియాల్లో భారత ఆర్మీ హైఅలర్ట్ అయింది. ఒక్కసారిగా సైనిక మోహరింపును పెంచేసింది. తాజాగా మరో 10వేల మంది సైనికులను చైనా బార్డర్‌కు భారత్ తరలించింది. దీంతో ఏం జరగబోతోందనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ఈనేపథ్యంలో జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన రైసినా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాపై ఆయన నిప్పులు చెరిగారు. ‘‘చైనా- భారత్ బార్డర్‌లో 1975 నుంచి 2020 సంవత్సరం వరకు శాంతియుత వాతావరణం కొనసాగింది. 2020 సంవత్సరంలో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణతో అంతా ఒక్కసారిగా మారిపోయింది’’ అని జైశంకర్ కామెంట్ చేశారు. ‘‘సరిహద్దులో చైనా రక్తపాతం క్రియేట్ చేస్తోంది. లిఖితపూర్వక ఒప్పందాలను ఆ దేశం ఉల్లంఘిస్తోంది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు భారత్, చైనాలు చాలా విషయాలపై వైరుధ్యాలతో రగిలిపోతున్నాయి. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతోంది. భారత్ మారుతోంది. ఇతర దేశాలతో భారత్ సంబంధాలు మారుతున్నాయి. భారత్ సామర్థ్యాలు పెరుగుతున్నాయి’’ అని జైశంకర్ తెలిపారు. ‘‘ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా గత రెండేళ్లలో పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈనేపథ్యంలో రష్యా మరింతగా ఆసియా దేశాలపై ఆధారపడుతోంది. ఇందులో భారత్ కూడా కీలకంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘పశ్చిమ దేశాలలాగే రష్యా కూడా ఆసియా ప్రాంతంలో సాధ్యమైనన్ని ఎక్కువ దేశాలతో బలమైన వాణిజ్య, విదేశాంగ సంబంధాలు ఉండాలని భావిస్తోంది. ఇది కూడా ఆసియా ఖండంలో సమీకరణాలను, బలాబలాలను మారుస్తోంది’’ అని భారత విదేశాంగ మంత్రి చెప్పారు.

ఘాటుగా స్పందించిన చైనా

చైనా బార్డర్‌లో భారత్ సైనికుల మోహరింపును పెంచిన అంశంపై చైనా ఘాటుగా స్పందించింది. సైనికుల సంఖ్యను భారత్ పెంచినంత మాత్రాన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గవని స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు తాము కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ఈమేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఓ ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై భారత సైనిక మోహరింపు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చైనా పేర్కొంది.

Tags:    

Similar News