White House Chief Of Staff: వైట్ హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ‘ఆమె’

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(US President) విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తొలి కీలక నియామకం చేపట్టారు.

Update: 2024-11-08 04:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(US President) విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తొలి కీలక నియామకం చేపట్టారు. వైట్ హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా 67 ఏళ్ల సూసీ వైల్స్(Susie Wiles) ని నియమించారు. ఈ మేరకు ట్రంప్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘సూసీ వినూత్న ఆలోచనలు కలిగిన వ్యక్తి. అమెరికాను మళ్లీ గొప్పగా తయారుచేసేందుకు ఆమె కృషి చేస్తారు. దేశం గర్వపడేలా ఆమె పనిచేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని ప్రకటనలో ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా.. ఈ నియామకంతో అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌(White House Chief Of Staff) సూసీనే కావడం విశేషం.

అసలు సూసీ ఎవరంటే?

ఇకపోతే, రిపబ్లికన్‌ పార్టీ క్యాంపెయిన్‌ మేనేజర్‌గా సూసీ వైల్స్ ఎన్నికల క్యాంపెయిన్ లో కీలకంగా వ్యవహరించారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయానికి ముఖ్య పాత్ర పోషించారు. మే 14, 1957న జన్మించిన సూసీ వైల్స్ ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ పాట్ సమ్మర్‌రాల్(Pat Summerall,) కుమార్తె. ఫ్లోరిడాకు(Florida) చెందిన సూసీ చాలాకాలంగా రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్తగా(political strategist) పనిచేస్తున్నారు. ఆమె 1980 అధ్యక్ష ఎన్నికల సమయంలో రోనాల్డ్ రీగన్ క్యాంపెయినింగ్ టీంలో పనిచేశారు. తన కెరీర్ ప్రారంభంలో ఆమె రిపబ్లికన్ ప్రతినిధులు జాక్ కెంప్, టిల్లీ ఫౌలర్‌ల వద్ద కూడా పనిచేశారు. 2012 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఉటా మాజీ గవర్నర్ జోన్ హంట్స్‌మన్ జూనియర్ ప్రచారానికి కూడా మేనేజర్ గా పనిచేశారు. అలానే, 2018లో జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిసాంటిస్ విజయం సాధించడంలో ఎంతో కృషి చేశారు. పక్కా ప్రణాళికతో అత్యంత వ్యూహాత్మకంగా ట్రంప్‌ తన ప్రచారాన్ని నిర్వహించడంలో ఆమె కృషి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఫ్లోరిడాలో ట్రంప్‌ చేసిన విక్టరీ స్పీచ్ లో ఆమెకు మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. కానీ, ఆమె మాత్రం ప్రసంగించేందుకు నిరాకరించారు. 2016, 2020 అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్రంలో ట్రంప్ ప్రచార బాధ్యతలను సూసీయే నిర్వహించారు.

Tags:    

Similar News