Elon Musk: ఇరాక్ రాయబారితో ఎలాన్ మస్క్ రహస్య భేటీ
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కీలక సమావేశం జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కీలక సమావేశం జరిగింది. ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి (Iran ambassador to UN) అమీర్ సయీద్ ఇరవానితో బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) భేటీ అయ్యారు. ఓ రహస్య ప్రదేశంలో గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ స్టోరీ వెల్లడించింది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల గురించే వారి మధ్య చర్చలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలానే, మీటింగ్ ఫలప్రదం అయినట్లు పేర్కొన్నాయి. అలానే, ఇరాన్ (Iran)పై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించాలని, టెహ్రాన్‌తో వాణిజ్యం చేయాలని టెహ్రాన్ రాయబారి మస్క్‌ను కోరినట్లు తెలుస్తోంది.
అధికారిక ప్రకటన
అయితే, వీరి భేటీపై అటు ట్రంప్-మస్క్ (Trump-Musk) వర్గం నుంచి గానీ.. యూఎన్(UN) లోని ఇరాన్ మిషన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ, ఇవే నిజమైతే.. ఇరాన్ తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకునే ఆలోచనలో ట్రంప్ ఉన్నారనే దానికి ఈ భేటీ సంకేతం కానుంది. ఇటీవల ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడులకు ఆదేశించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల విషయంలో ఓవైపు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తూనే.. ఇరాన్‌తో దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ (Donald Trump) సూచనప్రాయంగా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల వేళ తాజాగా మస్క్-అమీర్ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.