సల్మాన్ ఖాన్ హత్య కుట్ర కేసులో ఐదో నిందితుడు అరెస్టు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హత్య కుట్ర కేసులో మరో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, ఈ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హత్య కుట్ర కేసులో మరో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన దీపక్ గొగాలియా అలియాస్ జానీ వాల్మీకిని రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇటీవలే బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన నలుగురిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్మోల్, మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ సహా 17మందిపై కేసు నమోదు చేశారు.
పన్వేల్ ఫాంహౌజ్ దగ్గర 70 మందితో రెక్కీ
ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఇంటి దగ్గర ఈ ఏడాది ఏప్రిల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మరో హత్య కుట్ర గురించి తెలిసింది. సల్మాన్ ఖాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. ఇందుకోసం బిష్ణోయ్ గ్యాంగ్ పాకిస్థాన్‌కు చెందిన ఓ వెపన్స్ సప్లయిర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాల తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. సల్మాన్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 60-70 మంది నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.