తాత్కాలికంగా ‘ఢిల్లీ చలో’ నిలిపివేత.. ఆ ప్రపోజల్‌తో శాంతించిన రైతన్నలు
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీ బార్డర్‌లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఎట్టకేలకు కొంతమేర ఫలితం వచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీ బార్డర్‌లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఎట్టకేలకు కొంతమేర ఫలితం వచ్చింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు సంబంధించిన చట్టం చేయాలనే రైతుల డిమాండ్‌పై కేంద్ర సర్కారు స్పందించింది. ఆదివారం రాత్రి 8.15 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట వరకు రైతు సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో కేంద్ర మంత్రుల టీమ్ కీలక ప్రతిపాదన చేసింది. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరకు ఐదేళ్లపాటు కొంటామని రైతు నేతలకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను పండించే రైతులతో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సీపీఎఫ్), నాఫెడ్ వంటి సహకార సంఘాలు చట్టపరమైన ఒప్పందం కుదుర్చుకుంటాయని మంత్రుల బృందం పేర్కొంది. ఆయా పంటల కొనుగోళ్లపై ఎలాంటి పరిమితి ఉండదని తెలిపింది. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ఒక ప్రత్యేక పోర్టల్‌ను కూడా నడుపుతామని కేంద్ర మంత్రుల టీమ్ వెల్లడించింది. రైతు నేతలతో చర్చల అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మీడియాకు ఈ వివరాలన్నీ చెప్పారు. ‘‘రైతుల ఎదుట మేం చేసిన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయి’’ అని ఆయన తెలిపారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు.
మరో రెండు రోజుల్లో ..
కేంద్ర సర్కారు చేసిన ప్రతిపాదనలపై సోమ, మంగళవారాల్లో తమ సంఘాలతో చర్చిస్తామని రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పంథేర్ వెల్లడించారు. వాటిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మరో రెండు రోజుల్లో తమ ఇతర డిమాండ్లు కూడా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి నిరసనలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనే డిమాండ్లు ఇంకా నెరవేరలేదనే విషయాన్ని శర్వాన్ సింగ్ పంథేర్ గుర్తు చేశారు. రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీలపై టారిఫ్‌ల పెంపు నిలుపుదల, 2021 నిరసనల సందర్భంగా రైతులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలనే ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయన్నారు. వీటిపై కేంద్ర సర్కారు ఎలా స్పందిస్తుందనే దాని ఆధారంగా రైతు సంఘాలు తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. 2021 ఆందోళనల్లో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ వంటివి కూడా అన్నదాతల డిమాండ్లలో ప్రధానమైనవి. ఇక కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం కొనబోయే పంటల జాబితాలో నూనెగింజలు, బాజ్రాలను కూడా చేర్చాలని హర్యానాకు చెందిన ముఖ్య రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చారుని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇందుకు కేంద్రం నో చెబితే ఫిబ్రవరి 21 తర్వాత హర్యానాలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్రం ప్రపోజల్స్‌ను తిరస్కరించిన సంయుక్త కిసాన్ మోర్చా
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలతో తాము ఏకీభవించడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేేఎం) అనే రైతు సంఘం ప్రకటించింది. కేవలం మూడు పంటలకు మద్దతు ధరను కల్పించే ప్రపోజల్‌తో ఏకీభవించేది లేదని స్పష్టం చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం మొత్తం 23 పంటలకు ఎంఎస్పీని అందించాల్సిందే అని ఎస్‌కేెెఎం డిమాండ్ చేసింది. రైతుల ఫోకస్‌ను ఉద్యమం పైనుంచి మళ్లించేందుకు ఇలాాంటి ప్రపోజల్‌లను కేంద్రం తెరపైకి తెచ్చిందని అభిప్రాయపడింది. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కనీస మద్దతు ధరను అందించాలని రైతు సంఘం పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ బార్డర్‌లో నిరసన తెలుపుతున్న రైతు సంఘాల్లో ఎస్‌కేఎం లేదు. దీంతో ఆ సంఘం స్పందనను కేంద్ర సర్కారు ఏ విధంగా పరిగణిస్తుందనేది వేచిచూడాలి.
గుండెపోటుతో యువరైతు మృతి
ఢిల్లీ బార్డర్‌లో నిరసన తెలుపుతున్న రైతుల్లో మరొకరు ప్రాణాలు వదిలారు. తాజాగా పంజాబ్‌లోని పటియాలా జిల్లాకు చెందిన రైతు 45 ఏళ్ల నరీందర్ పాల్ గుండెపోటుతో మరణించారు. అతడు భారత్ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రహన్ అనే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనల్లో పాల్గొన్నాడు. పటియాలాలోని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాసం వద్ద ఆదివారం రాత్రి జరిగిన నిరసనల్లో నరీందర్ పాల్ పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. ఆ విషయాన్ని తోటి రైతులకు చెప్పాడు. దీంతో వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌లో నరీందర్‌ను చేర్పించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. గుండెపోటు రావడంతోనే నరీందర్ పాల్ మృతి చెందాడని తేల్చి చెప్పారు. అతడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారికి రూ.10 లక్షల అప్పు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈసారి రైతు ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల సంఖ్య మూడుకు పెరిగింది. ఇప్పుడు నరీందర్ పాల్ మృతి చెందగా.. ఇంతకు ముందు పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద ఒకరు.. ఖానౌరీ వద్ద మరొక రైతు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళన చేస్తున్న రైతులు చనిపోతుండటంతో మిగిలిన రైతుల కుటుంబాలు భయాందోళనలకు లోనవుతున్నాయి.