ఈవీఎం ఒక చోరీ యంత్రం: ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఈవీఎంలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంను ఒక దొంగిలించే యంత్రంగా అభివర్ణించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఈవీఎంలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంను ఒక దొంగిలించే యంత్రంగా అభివర్ణించారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఈవీఎంలు తారుమరయ్యే అవకాశం ఉందని కాబట్టి కశ్మీర్ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం శ్రీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘ఈవీఎం మిషన్ ఒక దొంగతనం చేసే యంత్రం. ఓటు వేసే ముందు బూత్ కు వెళ్లినప్పుడు దానిపై లైట్లను తనిఖీ చేయాలి. ఓటు వేసిన తర్వాత, మెషిన్ నుంచి బీఫ్ సౌండ్ రావాలి. మెషీన్లో లైట్ లేకపోతే దాని గురించి ఎన్నికల అధికారులను ప్రశ్నించాలి’ అని వ్యాఖ్యానించారు. అంతేగాక ఓటేసిన తర్వాత మిషన్ పక్కన ఉంటే వీవీ ప్యాట్‌ను గమనించాలి, మీరు ఓటేసిన గుర్తు స్లిప్‌లోని గుర్తు ఒకటేనా అని తనిఖీ చేయాలని చెప్పారు.
ఎన్నికలకు పోలింగ్ ఏజెంట్లుగా నిజాయితీ గల వ్యక్తులను నియమించాలని పార్టీ నాయకులను కోరారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికే ప్రధాని మోడీ మతపరమైన భయాందోళనలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. హిందువులకు రెండు ఇళ్లు ఉంటే ఒకటి లాక్కొని ముస్లింలకు ఇస్తారని చెప్పి హిందువులను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధికి సంబంధించినవి కావని, దేశాన్ని రక్షించడం కోసమేనని అన్నారు. ఎందుకంటే దేశాన్ని కాపాడితేనే మనం కూడా సురక్షితంగా ఉంటామని వెల్లడించారు.