కాంగ్రెస్‌కు అర్హత లేకున్నా..ఒక సీట్ ఆఫర్ చేస్తున్నాం: ఢిల్లీలో సీట్ షేరింగ్ పై ఆప్ కామెంట్స్
ఇండియా కూటమిలో సీట్ షేరింగ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే గోవా, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది. అంతేగాక ఢిల్లీ, పంజాబ్‌లలో ఒంటరిగా పోటీ
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిలో సీట్ షేరింగ్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే గోవా, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది. అంతేగాక ఢిల్లీ, పంజాబ్‌లలో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే దీనిపై కాంగ్రెస్ స్పందిచకపోయినప్పటికీ ఈ క్రమంలోనే మంగళవారం ఆప్ నేత సందీప్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పోటీ చేసే అర్హత లేకున్నా కూటమి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని ఆప్ ఒక సీటు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. 7 స్థానాలున్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ 1, ఆప్ 6 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ పార్టీతో రెండు సమావేశాలు జరిగాయని..కానీ ఇవేవీ ఫలితాలివ్వలేదని చెప్పారు. అంతేగాక నెలరోజులుగా ఎలాంటి సమావేశం జరగలేదని, తదుపరి మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు ఉన్నాయని, ఎంసీడీ ఎన్నికల్లో 250కి గాను 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని సందీప్ గుర్తు చేశారు.
ఢిల్లీలో పట్టుకు హస్తం పార్టీ ప్రయత్నాలు
గతంలో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బలమైన పనితీరు కనబర్చింది. మెజారిటీ అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు ఎంసీడీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. అయితే వరుస ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ ఢిల్లీలో మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో 4:3 ఫార్ములాను సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాలుగు, ఆప్ మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ నిర్ణయంపై ఏకాభిప్రాయం సాధించడంలో కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. కాగా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని 7లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.