కోర్టులో సీఎం కేజ్రీవాల్ వాదనలు.. టాప్ పాయింట్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ గడువు ముగియనుండటంతో గురువారం ఉదయం ఆయనను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు.

Update: 2024-03-28 15:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ గడువు ముగియనుండటంతో గురువారం ఉదయం ఆయనను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌.వి.రాజు వాదనలు వినిపిస్తూ .. కేజ్రీవాల్‌ను విచారణ నిమిత్తం మరో ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరారు. కేజ్రీవాల్‌ను విచారించే సమయంలో ఐదు రోజులు స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశామని.. ఆయన దాటవేత సమాధానాలను చెబుతున్నారని ఈడీ ఆరోపించింది. డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లను ఆయన వెల్లడించలేదని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాలను కూడా రికార్డు చేసినట్లు తెలిపింది. ఈసందర్భంగా కేజ్రీవాల్‌ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును నలుగురు సాక్షులు మాత్రమే ప్రస్తావించారని.. ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలే సరిపోతాయా? అని ఈడీని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘‘ఈ కేసుపై ఈడీ రెడీ చేసిన వేలకొద్దీ డాక్యుమెంట్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నా పేరు ప్రస్తావనకు వచ్చింది. అందులో ఒకచోట సి.అరవింద్ అనే పేరు వచ్చింది. ఆ పేరు కలిగిన వ్యక్తి అప్పట్లో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సెక్రెటరీగా ఉండేవారు’’ అని ఆయన వివరించారు. ‘‘లిక్కర్ స్కాంలోని మరో నిందితుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చింది. కేసులోని నిందితులను భయభ్రాంతులకు గురిచేసి లంచాలు వసూలు చేసే రాకెట్‌ను బీజేపీ నడుపుతోంది. విపక్ష పార్టీలన్నీ దీనిపైనే గొంతు చించుకుంటున్నాయి’’ అని కోర్టులో కేజ్రీవాల్ ఆరోపణ చేశారు.

గోవా ఎన్నికలకు హవాలా డబ్బుపై ఆధారాలున్నాయ్..

దేశం ముందు ‘ఆప్‌’‌ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు ఈడీ యత్నిస్తోందని ఆప్ చీఫ్ ఆరోపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ను జైల్లో వేయడం, ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయడమనే రెండు మిషన్లతో ఈడీ పనిచేస్తోందని న్యాయస్థానానికి చెప్పారు. ఈసందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకొని మాట్లాడుతూ.. ‘‘గోవా నుంచి పిలిపించిన కొందరితో కలిపి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సి ఉంది. విచారణకు ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ సహకరించడం లేదు. సీఎం అయినంత మాత్రాన అరెస్ట్ చేయకూడదా?’’ అని ప్రశ్నించారు. ‘‘అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఉన్న పేజీలు ఈడీ దగ్గర ఉన్నాయని కేజ్రీవాల్‌ ఎందుకు భావిస్తున్నారు ? మా దగ్గర వేలాది డాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన ఎలా చెప్పగలుగుతున్నారు ? అవన్నీ కేజ్రీవాల్ ఊహాగానాలే’’ అని ఈడీ తరఫు న్యాయవాది అడిగారు. ‘‘సౌత్ గ్రూపు నుంచి గోవా ఎన్నికలకు హవాలా ద్వారా రూ.100 కోట్లు అందిన వ్యవహారానికి సంబంధించిన ఆధాారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. కేజ్రీవాల్ వ్యూహాత్మకంగానే దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. పైవాదనలన్నీ విన్న కోర్టు కేజ్రీవాల్‌ను నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించేందుకు అనుమతించింది. ఏప్రిల్‌ 1న ఉదయం 11గంటలకు తమ ఎదుట ఆప్ చీఫ్‌ను హాజరుపర్చాలని ఆదేశించింది. ఇక ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రాంగణంలోకి వెళ్తున్న సమయంలో విలేకరులతో ఆప్ చీఫ్ మాట్లాడుతూ.. ‘‘లిక్కర్ స్కాం కేసు రాజకీయ కుట్ర. దీనికి ప్రజలే సమాధానం చెబుతారు’’ అని కామెంట్ చేశారు.

Tags:    

Similar News