బెంగాల్ లోని రెండు బూత్ లలో రీపోలింగ్..!

పశ్చిమ బెంగాల్‌లోని రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-06-02 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లోని రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. బరసత్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఒక బూత్‌లో, మధురాపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఒక బూత్‌లో రీపోలింగ్‌కు కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు బూత్‌ల్లోనూ ఏడో దశలో భాగంగా ఈ నెల 1న పోలింగ్‌ జరిగింది. ఇదిలా ఉండగా, డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానంలోని పలు బూత్‌లలో రీపోలింగ్ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈసీకి లేఖ రాసింది.

జూన్ 19 వరకు బెంగాల్ లోనే కేంద్రబలగాలు

బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత హింస చెలరేగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సందేశ్ ఖాలీలో మహిళలు, పోలీసులు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 19 వరకు 400 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలయ్యాక శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతంలో శాంతిభద్రలకు భంగం కలగకుండా చూసేందుకు జూన్ 19 వరకు కేంద్రబలగాలు బెంగాల్ లోనే ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.


Similar News