EC: ఈవీఎంను హ్యాక్ చేస్తానన్న వ్యక్తిపై ఫిర్యాదు చేసిన ఎన్నికల సంఘం
అవాస్తవమని, నిరాధారమైనవని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) పోలీసులకు ఫిర్యాదు చేశారు
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మెషిన్ ఫ్రీక్వెన్సీని ఐసోలేట్ చేయడం ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెప్పిన వ్యక్తిపై ముంబై సైబర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు తెలిపారు. సయ్యద్ షుజా చెప్పిన మాటలు అవాస్తవమని, నిరాధారమైనవని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల ఓ జాతీయ మీడియా రహస్యంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో సదరు వ్యక్తి రూ. 50 కోట్లు ఇస్తే ఈవీఎంలను హ్యాక్ చేస్తాననని చెప్పాడు. ఆ విడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాని ఆధారంగా సయ్యద్ షుజాపై నవంబర్ 30న సీఈఓ ఫిర్యాదు చేశారు. 2019లో సైతం అతను ఇలాంటి వ్యాఖ్యలే చేశాడని ఈసీ స్పష్టం చేసింది. అవాస్తవమైన విషయాలను చెప్పాడనే కారణంతో 2019లో ఢిల్లీలోనూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి చర్యలు తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని, ఇందులో ప్రమేయం ఉన్న ఎవరూ తప్పించుకోలేదని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. ఈవీఎంలు వైఫై, బ్లూటూత్‌తో సహా ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయకుండా స్వతంత్రంగా పనిచేసే యంత్రాలని ఈసీ స్పష్టం చేసింది. ఈవీఎంలు పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్ అని పేర్కొంది.