పులి ఎదుట కుప్పిగంతులు.. సఫారీలో టూరిస్టుల దుస్సాహసం
దిశ, నేషనల్ బ్యూరో : జంగిల్ సఫారీకి వెళ్లే టూరిస్టులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అనర్ధం ముంచుకొచ్చే ముప్పు ఉంటుంది.
దిశ, నేషనల్ బ్యూరో : జంగిల్ సఫారీకి వెళ్లే టూరిస్టులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అనర్ధం ముంచుకొచ్చే ముప్పు ఉంటుంది. ఏ పులో..సింహమో.. క్రూర జంతువో చుట్టుముట్టే రిస్క్ పెరిగిపోతుంది. ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఇటీవల ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న జంగిల్ సఫారీలో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. కూతవేటు దూరంలో చిరుత పులి కులాసాగా కూర్చొని ఉండగా.. నలుగురు టూరిస్టులు ఓపెన్ టాప్ జీపులో నిర్భయంగా నిలబడ్డారు. కొన్ని సెకన్లలోనే ఈ స్వల్ప దూరాన్ని దాటేసి వచ్చి ఎటాక్ చేయగల దమ్ము చిరుతలకు ఉంటుంది. టూరిస్టుల నిర్లక్ష్యాన్ని అద్దంపట్టే ఈ ఫొటోను సఫారీ సమీపంలో నివసించే స్థానికుడు ఆనంద్ శంకర్ తీసి ఫిబ్రవరి 13న ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేశాడు. అది వైరల్ మారడంతో లక్షలాదిగా వ్యూస్ వచ్చాయి. టూరిస్టులంతా పులికి దగ్గరగా ఓపెన్ టాప్ జీపులో నిలబడి ఉండగా చూసి తాను ఎంతో ఆందోళనకు గురయ్యాయని ఆనంద్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ‘‘టూరిస్టు గైడ్, డ్రైవర్‌తో పాటు నేను ఆ టూరిస్టులకు ఎంతో నచ్చజెప్పాం. జీపు లోపల ఉంటేనే సేఫ్ అని చెప్పాం. అయినా వాళ్లు పెడచెవిన పెట్టారు. ఓపెన్ టాప్ జీపులో నిలబడ్డారు’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో టూరిస్టులకు ఏదైనా జరిగితే నిరుపేద కుటుంబాలకు చెందిన టూరిస్టు గైడ్‌లు, డ్రైవర్లు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆనంద్ శంకర్ తన పోస్ట్‌లో వివరించారు.