ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలున్నారా ? నాకూ ఐదుగురు పిల్లలు : ఖర్గే

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఎక్కువ మంది పిల్లలున్న వారు’’ అంటూ ముస్లింలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు.

Update: 2024-05-01 15:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఎక్కువ మంది పిల్లలున్న వారు’’ అంటూ ముస్లింలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి మెజారిటీ దిశగా దూసుకెళ్తోందనే అంచనాలు అందబట్టే ప్రధాని మోడీ ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నైరాశ్యంలో మునిగిపోయిన మోడీ.. చివరి ప్రయత్నంగా మంగళసూత్రం, ముస్లింలను ప్రచారాస్త్రంగా మలుచుకున్నారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కువ మంది పిల్లలున్న వారిపై మోడీకి అక్కసు ఉంది. వారి సంక్షేమం గురించి ఆయనకు పట్టదు. చాలా వర్గాల వారికి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఈవిషయంలో కేవలం ముస్లింలనే మోడీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?’’ అని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు. ‘‘ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలున్నారా ? నాకు కూడా ఐదుగురు పిల్లలున్నారు. నా తల్లిదండ్రులకు మాత్రం నేను ఒక్కడినే కొడుకును. మా ఇంటికి ఎవరో నిప్పంటించడంతో ఇంట్లో ఉన్న అమ్మ, సోదరి, మామ చనిపోయారు’’ అని ఖర్గే తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. ‘‘మా నాన్నకు నేనొక్కడినే కొడుకును. నాకు ఎక్కువమంది పిల్లలు ఉండాలని ఆయన కోరుకునేవారు’’ అని కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దాదాపు 55 ఏళ్లపాటు పాలించింది. ఎప్పుడైనా ప్రజల సంపదను లాక్కోవాలని చూసిందా ? ఎవరి మంగళసూత్రాన్నైనా లాక్కుందా ?’’ అని ఆయన మోడీని ప్రశ్నించారు.

Tags:    

Similar News