'రాజ్యంగం మార్పు' అంశంపై తీవ్ర దుమారం

ఇటీవల ఒక కార్యక్రమంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా షేర్ చేశారు.

Update: 2025-03-24 12:54 GMT
రాజ్యంగం మార్పు అంశంపై తీవ్ర దుమారం
  • whatsapp icon

- కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్న బీజేపీ

- తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న డీకే శివకుమార్

- కర్ణాటక రిజర్వేషన్ విధానంపై రాజకీయ యుద్దం

దిశ, నేషనల్ బ్యూరో: మత రిజర్వేషన్లకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని తాను వ్యాఖ్యానించలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ రాజ్యంగ విలువలను దెబ్బతీస్తున్నారని బీజేపీ ఆరోపించింది. అయితే ప్రజలను అయోమయానికి గురి చేయడానికి తన మాటలను ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తప్పుదారి పట్టించిందని డీకే మండిపడ్డారు. సోమవారం బెంగళూరులో విలేఖరులతో మాట్లాడిన డీకే.. బీజేపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను రాజ్యాంగాన్ని మారుస్తానని ఎప్పుడూ చెప్పలేదు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా నా మాటలను వక్రీకరిస్తోందని అన్నారు. దీనిపై నేను చట్టపరమైన చర్యలను తీసుకుంటానని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని.. కోర్టుల తీర్పుల వల్ల రాజ్యాంగ సవరణలు చేసిన సందర్భాలు ఉన్నాయని మాత్రమే తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. ఈ మాటలను బీజేపీ వక్రీకరించిందని డీకే శివకుమార్ అన్నారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా షేర్ చేశారు. ఈ క్లిప్‌లో శివకుమార్ రాజ్యాంగంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ.. మంచి రోజు వస్తుంది. చాలా మార్పులు రాజ్యాంగంలో జరుగుతాయని అన్నారు. కాగా, ముస్లింలకు మత ఆధారిత రిజర్వేషన్లు మంజూరు చేయడానికి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండటాన్ని కూడా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రయోజనాల కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. దేశ విభజన సమయంలో కూడా కాంగ్రెస్ చారిత్రాత్మంగా ముస్లింలకే అనుకూలంగా ఉందని.. ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తోందని మాల్వియా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల పట్ల వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు.

అయితే అమిత్ మాల్వియా వ్యాఖ్యలపై డీకే శివకుమార్ మండిపడ్డారు. అతను దేశం మొత్తాన్ని తప్పుదారి పట్టిస్తున్న రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. బీజేపీ ఎప్పుడూ దేశాన్ని తప్పుదారి పట్టించడానికే ప్రయత్నించింది. బీజేపీవి చౌకబారు రాజకీయాలు. నా పేరు, సోనియా గాంధీ కుటుంబ లేదంటే కాంగ్రెస్ పార్టీ పేర్లను ప్రస్తావించకుండా వారికి రాత్రి పూట నిద్రపట్టదని డీకే వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News