కార్యకర్త చెంప ఛెల్లుమనిపించిన డీకే శివకుమార్
ఎన్నికల ప్రచారం చేస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు వీధుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎర్రటి ఎండలోనూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం చేస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హవేరి ప్రాంతానికి వెళ్లిన డీకే శివకుమార్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఆ సమయంలో తన వాహనం దిగగానే పార్టీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు. అదే సమయంలో ఓ కార్యకర్త చనువుతో ఆయన భుజంపై చేయి వేయడంతో అతనిపై చేయి చేసుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత, మున్సిపక్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియాన్ ఆయన భుజంపై చేయి వేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శివకుమార్ కార్యకర్త చెంపను ఛెల్లుమనిపించారు. అంతేకాకుండా అతన్ని పక్కకు తోసేశారు. అల్లావుద్దీన్‌ను డీకే పక్కకు తోసేయడం చూసిన సెక్యూరిటీ సిబ్బంది సైతం అతన్ని వెనక్కి తోసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కర్ణాటకలో ఏప్రిల్ 26న 14 స్థానాలకు ఓటింగ్ ముగియగా, మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది.