Mohan Bhagwat: ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని తలపిస్తోంది- మోహన్ భగవత్
పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని తలపిస్తోందన్నారు. ‘ ముష్కరులు మతాన్ని అడిగిన తర్వాతే ప్రజలను కాల్చి చంపారు. హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరు. మా హృదయాల్లో బాధ ఉంది. ఈ ఘటన ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని గుర్తు చేస్తోంది. రామాయణంలో రావణుడు తన మనసును మార్చుకోవడానికి నిరాకరించాడు. వేరే మార్గం లేక రాముడు అతన్ని చంపాడు. ఇది మన స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు. కానీ నిశ్శబ్దంగా హానిని భరించడం కూడా తప్పే. అహింసావాది కూడా బలంగానే ఉండాలి. బలం లేకపోతే వేరే మార్గం లేదు. కానీ బలం ఉన్నప్పుడు అవసరమైన సమయాల్లో అది కన్పించాలి’ అని అన్నారు.
సమాజంలో ఐక్యత అవసరం
ఇలాంటి విషాదాలను నివారించేందుకు, దురుద్దేశాన్ని అరికట్టడానికి సమాజంలో ఐక్యత అవసరమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. ‘అలాగే కొందరు దుర్మార్గులు మారరు. అలాంటి వారు నశించాల్సిందే. మనం ఐక్యంగా ఉంటే.. ఎవరూ మనపై దాడి చేయడానికి ధైర్యం చేయరు. కానీ కొన్ని చీకటి శక్తులు దేశాన్ని విడదీయడానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారి మీద ధర్మం గెలవాల్సిందే. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిందే’ అని స్పష్టం చేశారు. కాగా.. ఏప్రిల్ 22న పెహల్గామ్ కు సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పురుషులే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దాడి తర్వాత అడవుల్లోకి పారిపోయిన ముష్కరులను పట్టుకునేందుకు భద్రతాబలగాలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి.