మరో ‘మహా’ కలకలం.. ఛగన్ భుజ్‌బల్ రాజీనామా

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్సీపీలోని అజిత్‌పవార్ వర్గానికి చెందిన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ శనివారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Update: 2024-02-04 14:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్సీపీలోని అజిత్‌పవార్ వర్గానికి చెందిన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ శనివారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఓబీసీల రిజర్వేషన్లకు కోత పెట్టి.. మరాఠాలకు కోటాను కేటాయించే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ తాను గత నవంబరులోనే రాజీనామా చేశానని ఆయన చేసిన ప్రకటనతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ అంశంపై ఆదివారం స్పందించిన ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్.. ఛగన్ భుజ్‌బల్ రాజీనామాను ఆమోదించలేదని వెల్లడించారు. దీనిపై సీఎం ఏక్‌నాథ్ షిండేనే పూర్తి స్పష్టత ఇస్తారని విలేకరులకు చెప్పారు. ‘‘ఓబీసీల కోసం తుదిశ్వాస వరకు పోరాడుతాను. నాకు పదవులు అక్కర్లేదు. గతేడాది నవంబరు 16నే మంత్రిపదవికి రాజీనామా చేసి.. నవంబరు 17న అంబాద్‌లో జరిగిన ఓబీసీ ఎల్గార్ ర్యాలీలో పాల్గొన్నాను. రాజీనామాపై మాట్లాడొద్దని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కోరినందు వల్లే నేను గత రెండు నెలలుగా మౌనంగా ఉంటున్నాను’’ అని ఛగన్ భుజ్‌బల్ వ్యాఖ్యానించారు. దీనిపై మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ జరాంగే స్పందిస్తూ.. ‘‘ఛగన్ భుజ్‌బల్ మాటలు మాని, రాజీనామా చేయాలి. మరాఠా రిజర్వేషన్ గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించం. ఛగన్ భుజ్‌బల్ అనవసర రాద్ధాంతం చేస్తూ డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్‌లకు నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

Tags:    

Similar News