రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్.. గతంలో రిజైన్ చేసిన రైల్వే మంత్రులు వీరే
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష టీఎంసీ విమర్శలు గుప్పిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష టీఎంసీ విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లు ఢీ కొనకుండా సాంకేతిక పరికరాలను అమర్చడంలో నిర్లక్ష్యం చూపించే కేంద్రం అదే ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టేందుకు సాఫ్ట్ వేర్ ల కోసం కోట్లాది రూపాయలను ఖర్చే చేస్తోందని ధ్వజమెత్తింది. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ కు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మంత్రులపై చర్చ జరుగుతోంది.
రాజీనామా చేసిన ఆ ఇద్దరు..
చరిత్రలో గమనిస్తే తమ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన వారిలో ఇద్దరు రైల్వే మంత్రులు ఉన్నారు. 1956వ సంవత్సరం నవంబర్ లో తమిళనాడులోని అరియాలూర్ లో రైలు ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో 142 మంది చనిపోయారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు. అ తర్వాత 1999లో నాటి రైల్వే శాఖ మంత్రి నితీష్ కుమార్ సైతం రాజీనామా చేశారు. ఆగస్టు 1999లో అస్సాంలో జరిగిన గ్యాస్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతగా తన పదవిని వదిలిపెట్టారు. ఈ ప్రమాదంలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరి రాజీనామా తిరస్కరణ..
వాజ్‌పేయి హయాంలో 2000 సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. వాటికి బాధ్యతగా అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను ప్రధానిగా ఉన్న వాజ్ పేయి తిరస్కరించారు. 2016లో కాన్పూర్ సమీపంలో పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ యొక్క 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇందులో 150 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ నాటి రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. కానీ దానికి ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించలేదు.