కాంగ్రెస్ ఐటీ లెక్కల్లో రూ.520 కోట్ల తేడాలున్నాయ్ : ఐటీ శాఖ
దిశ, నేషనల్ బ్యూరో : ఆదాయపు పన్ను చెల్లింపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఆదాయపు పన్ను చెల్లింపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్ ఆదాయంపై ఐటీశాఖ చేపట్టిన ట్యాక్స్ రీ అసెస్‌మెంట్ ప్రక్రియను ఆపాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను పునఃపరిశీలనకు ఉన్న గడువు తీరిపోయింది. కేవలం ఆరేళ్లు మాత్రమే వెనక్కివెళ్లి అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు. దీనికి ఐటీశాఖ బదులిస్తూ.. ‘‘మేం నిబంధనలు ఉల్లంఘించలేదు. స్వాధీనం చేసుకొన్న ఆధారాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను లెక్కల్లో రూ.520 కోట్ల మేరకు తేడాలు వస్తున్నాయి’’ అని హైకోర్టు బెంచ్‌కు తెలిపింది. దీంతో కాంగ్రెస్ రిట్ పిటిషన్లను కొట్టివేస్తున్నామని న్యాయమూర్తులు జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై మార్చి 20న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా శుక్రవారం తీర్పును వెలువరించింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు.