BREAKING: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
అందరూ ఊహించిన విధంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అందరూ ఊహించిన విధంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం రెండు బృందాలుగా ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న అధికారులు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. మరోవైపు ఆప్ లీగల్ టీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు.. సీఎం ఇంట్లో తనిఖీల జరుగుతోన్న విషయం తెలుసుకున్న ఆప్ నేతలు భారీగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.
దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు పురోగతి దృష్ట్యా తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఎమ్మెల్యే కవిత ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ పరిణామాలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.