Wayanad landslide: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 174కు చేరిన మరణాలు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతుంది.
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 174కు చేరుకుంది. ఇంకా 225 మంది గల్లంతయ్యారు. సైనిక సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేశారు , సైన్యం ఇప్పటివరకు 89 మృతదేహాలను వెలికితీయగా, దాదాపు 1,000 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. రెండో రోజు జరుగుతున్న ఆపరేషన్‌లో అదనంగా సిబ్బందిని మోహరించారు. తిరువనంతపురం, బెంగళూరు నుండి రోడ్డు, వాయుమార్గంలో వారిని కాలికట్‌కు తరలించినట్లు రక్షణ ప్రకటన తెలిపింది.
ముండక్కై కుగ్రామంలో ధ్వంసమైన ఇళ్లలో మృతదేహాలు భయంకరంగా ఉన్నాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది ఇళ్ల శిథిలాలను తొలగించినప్పుడు వాటి క్రింద మృతదేహాలు పడుకున్న విధంగా కనిపించాయి. వారంత నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండచరియలు మీద పడటంతో నిద్రలో ఉన్న వారు అలాగే చనిపోయారు. ఆర్మీ, నేవీ, NDRF రెస్క్యూ సిబ్బంది కూలిపోయిన పైకప్పులు, శిథిలాల క్రింద ఉన్న వారి కోసం వెతుకుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా బాధితులు, ప్రజల అరుపులు మిన్నంటుతున్నాయి. బురద ప్రవాహంలో ప్రజల శరీర భాగాలు కనిపిస్తున్నాయి. శిథిలాలలో లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రుల మార్చురీలకు తరలిస్తున్నారు.