రేషన్ కార్డు దారులకు మరోసారి గుడ్‌న్యూస్.. మూడు నెలలు చాన్స్

ఇప్పటి వరకు ఆధార్-రేషన్ కార్డు లింక్ చేయని వారికి శుభవార్త. మరో అవకాశంగా అందుకు సంబంధించిన గడువును ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది

Update: 2024-06-12 10:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటి వరకు ఆధార్-రేషన్ కార్డు లింక్ చేయని వారికి శుభవార్త. మరో అవకాశంగా అందుకు సంబంధించిన గడువును ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. ఇంతకుముందు రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2024 వరకు ఉండగా, దానిని సెప్టెంబర్ 30 వరకు పెంచింది. దీనికి సంబంధించి ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రేషన్ కార్డులను ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, అర్హులైన వారికి మాత్రమే ఆహార ధాన్యాలను అందించడం సులభం అవుతుంది. నకిలీ రేషన్ కార్డులు కూడా చాలా వరకు తగ్గి ప్రభుత్వానికి ప్రజా పంపిణీపై చేస్తున్న ఖర్చులు కూడా తగ్గుతాయి.

ఫిబ్రవరి 2017లో, పీడీఎస్ కింద ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన గడువును పలుమార్లు పొడిగిస్తూ వస్తుంది. తాజాగా మరోసారి అవకాశం ఇవ్వడానికి ఆధార్-రేషన్ కార్డు లింక్ తేదీని పొడిగించింది. ఇప్పటికే చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 99.8 శాతం రేషన్ కార్డులు ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడినట్లు మోడీ ప్రభుత్వం గత ఏడాది లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.

తక్కువ సంఖ్యలో మాత్రమే ఆధార్-రేషన్ కార్డు లింక్ చేయని వారు ఉన్నారు, వారి కోసం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరి తేదీ లోపు ఈ పనిని పూర్తి చేయకపోతే సబ్సిడీ ఆహార పదార్థాలు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేరు. ఆధార్‌ను లింక్ చేయడానికి సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించవచ్చు లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా పూర్తి చేయవచ్చు.


Similar News