Cyclone Remal : రెచ్చిపోయిన ‘రెమాల్’.. బంగ్లా, బెంగాల్‌లో 16 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో : ‘రెమాల్’ తుఫాను రెచ్చిపోయింది. సోమవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత పెను విధ్వంసాన్ని సృష్టించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ‘రెమాల్’ తుఫాను రెచ్చిపోయింది. సోమవారం తెల్లవారుజామున బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత పెను విధ్వంసాన్ని సృష్టించింది. భారీ వర్షం, ఈదురుగాలులతో బెంగాల్, బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఈసందర్భంగా చోటుచేసుకున్న పలు ప్రమాద ఘటనల్లో మొత్తం 16 మంది చనిపోయారు. వీరిలో 10 మంది బంగ్లాదేశ్ ప్రజలు కాగా, ఆరుగురు బెంగాల్ వాస్తవ్యులు. బెంగాల్‌లో చనిపోయిన వారిలో.. నలుగురు విద్యుదాఘాతంతో, ఒకరు కాంక్రీట్ మీద పడి, మరొకరు ఇల్లు కూలి ప్రాణాలు విడిచారు. తుఫాను తీరం దాటే టైంలో గంటకు 135 కి.మీ వేగంతో వీచిన బలమైన ఈదురు గాలులకు వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని బంగ్లాదేశ్‌లో దాదాపు 30 లక్షల మంది ప్రజలు చీకట్లో గడపాల్సి వచ్చింది. తీర ప్రాంతాల్లోని దాదాపు 30వేల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇక మన దేశంలోని బెంగాల్‌లో దాదాపు 1,200 విద్యుత్ స్తంభాలు నేలకూలగా, 300 మట్టి గుడిసెలు నేలమట్టమయ్యాయి.
సుందర్‌బన్స్ తీర ప్రాంతాల్లో..
ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవులకు నిలయమైన సుందర్‌బన్స్‌లోని తీర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కోల్‌కతా నగరంలో అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. దీంతో రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం నుంచి తుఫాను బలహీనపడటం మొదలైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.దీంతో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో నిలిపివేసిన విమాన సర్వీసులు.. 21 గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ తుఫాను నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాటికే బంగ్లాదేశ్‌లో దాదాపు 8 లక్షల మందిని, బెంగాల్‌లో దాదాపు 1.10 లక్షల మందిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు.