Kolkata Rape-Murder: మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు రూపొందిస్తున్నాం- మోడీ

:మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

Update: 2024-08-25 11:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం మహారాష్ట్ర జల్గావ్‌లోని లఖ్ పతి దీదీ సదస్సులో మోడీ ప్రసంగించారు. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."మహిళల భద్రత చాలా ముఖ్యం. మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు చెబుతాను. దోషులు ఎవరైనా సరే.. వారిని విడిచిపెట్టకూడదు" అని అన్నారు. మోడీ మాట్లాడుతూ.. “మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను రూపొందిస్తున్నాం. గతంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. భారతీయ న్యాయ సంహితలో అనేక సవరణలు చేశాం. మహిళ పోలీసు స్టేషన్‌కు వెళ్లకూడదనుకుంటే.. ఆమె ఇ-ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయవచ్చు. దాన్ని ఎవరూ మార్చలేరు. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అండగా ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు.

గత పదేళ్లలో రూ.9 లక్షల కోట్లు

2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25 వేల కోట్ల కంటే తక్కువ రుణాలు వచ్చాయని మోడీ అన్నారు. కానీ, గత పదేళ్లలో మహిళలకు రూ.9 లక్షల కోట్లు అందించామన్నారు. మహారాష్ట్రలోని బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న మహాయుతి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు, స్థిరత్వం కోసం చూస్తుందన్నారు. మహాయుతి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి మహారాష్ట్ర ప్రకాశించే నక్షత్రం అని వర్ణించారు. మహారాష్ట్రకు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని హామీ ఇచ్చారు.


Similar News