PM Modi: ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయడం ఎన్డీఏ అదృష్టం- మోడీ
ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము(Droupadi Murmu)ని రాష్ట్రపతిగా చేయడం ఎన్డీఏ అదృష్టంగా భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము(Droupadi Murmu)ని రాష్ట్రపతిగా చేయడం ఎన్డీఏ అదృష్టంగా భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. బిహార్(Bihar)లో నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. జముయీలో రూ.6640 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ ప్రభుత్వం.. ఆదివాసీ మహిళకు అత్యున్నత పదవిని ఇచ్చి గౌరవించిందన్నారు. మొదట్లో రాష్ట్రపతి పదవికి ముర్ము పేరును ప్రతిపాదించగానే.. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) అందరికీ పిలుపునిచ్చారని మోడీ అన్నారు. పీఎం జన్‌మన్ యోజన (PM Janman Yojana) పథకం ద్వారా పనుల ప్రారంభ ఘనత ద్రౌపదీ ముర్ముదే అని కొనియాడారు. గిరిజనుల కష్టాలను తీర్చేందుకు ఈ పథకం ద్వారా రూ.24వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని గిరిజనులకు పిలుపునిచ్చారు.
గతప్రభుత్వాలపై విమర్శలు
వెనుకబడిన వర్గాల కోసం గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మోడీ విమర్శించారు. సమాజానికి దూరంగా నివసిస్తున్న గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఆదివాసీలు పండించే దాదాపు 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) ఇచ్చామన్నారు. ఆదివాసీ యువత క్రీడలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని.. వారిని మరింత ప్రోత్సహించడానికి అనేక క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. వారికి చదువు, సంపద, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వారందరి సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశామని.. బడ్జెట్‌ను రూ.25,000 కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు.