రేప్ బాధితురాలి గోడు వినకుండా నిందితుడికి బెయిల్.. అనూహ్య ట్విస్ట్

దిశ, నేషనల్ బ్యూరో : అత్యాచారం కేసులో బాధితురాలి వాదన వినకుండానే ఓ వ్యక్తికి బెయిల్‌ను మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.

Update: 2024-04-12 19:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అత్యాచారం కేసులో బాధితురాలి వాదన వినకుండానే ఓ వ్యక్తికి బెయిల్‌ను మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. 2022 జూన్‌లో ట్రయల్ కోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ చావ్లా పక్కన పెట్టారు. నేరం జరిగిన తర్వాత కనీసం విచారణకు అవకాశం ఇవ్వకపోవడం బాధితుల హక్కులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయస్థానం పేర్కొంది. ‘‘ఈ కేసులోని నిందితుడు 2022 జూన్ 14 నుంచి బెయిల్‌పైనే ఉన్నాడు. ట్రయల్ కోర్టు చట్టపరమైన ప్రక్రియను పాటించడంలో విఫలమైనందున దాని ఆర్డర్‌ను పక్కనపెడుతున్నాం. ఈరోజు నుంచి రెండు వారాల్లోగా నిందితుడు బెయిల్ కోరుతూ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది’’ అని హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు నుంచి కొత్తగా ఆర్డర్ జారీ అయ్యే వరకు సదరు నిందితుడిని అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News