కేరళ ప్రొఫెసర్ చేతిని నరికిన కేసు.. వారే దోషులు

కేరళలో ఓ ప్రొఫెసర్‌పై దాడి చేసి, ఆయన చేతిని నరికిన కేసులో ఆరుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులే దోషులని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.

Update: 2023-07-12 11:05 GMT

కొచ్చి : కేరళలో ఓ ప్రొఫెసర్‌పై దాడి చేసి, ఆయన చేతిని నరికిన కేసులో ఆరుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులే దోషులని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. 2010లో జరిగిన ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు తీర్పు వెలువడింది. దోషులు సాజల్, నాసిర్, నజీబ్, నౌషాద్, మొయిదీన్‌కుంజు, అయూబ్‌లకు న్యాయస్థానం గురువారం మధ్యాహ్నం శిక్షలను ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. మలయాళం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టీజే జోసఫ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్నాకుళం జిల్లాలోని మువట్టుపుజలో ఉన్న చర్చిలో ఆదివారం ప్రార్థనలకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా 2010 జూలై 4న దాడి జరిగింది.

దుండగులు ఆయన కుడి అరచేతిపై, కాలుపై కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దాడికి పాల్పడినవారు పీఎఫ్ఐ సభ్యులని అప్పట్లోనే గుర్తించారు. ఈ కేసును ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు విచారించింది. మొదటి దశలో 31 మందిని విచారించి, పదిమందికి ఒక్కొక్కరికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2015 ఏప్రిల్‌లోనే తీర్పు చెప్పింది. మిగిలినవారిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. రెండో దశలో ఆరుగురు దోషులని కోర్టు బుధవారం నిర్ధారించింది.


Similar News