ప్రజ్వల్ ఫోన్ డేటా కోసం యాపిల్ సర్వర్ల యాక్సెస్ కోరుతున్న అధికారులు
కర్ణాటక సెక్స్ టేపుల వ్యవహారంలో ప్రజ్వల్ రేవణ్ణ ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే ప్రజ్వల్ మహిళలతో శృంగార వీడియోలను చిత్రీకరించాడని అధికారులు భావిస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక సెక్స్ టేపుల వ్యవహారంలో ప్రజ్వల్ రేవణ్ణ ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే ప్రజ్వల్ మహిళలతో శృంగార వీడియోలను చిత్రీకరించాడని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఫోన్ గురించి ప్రజ్వల్ ను ప్రశ్నించగా.. ఏడాది క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని తెలిపారు. ఫోన్ పోయినట్లు హోలెనరసిహూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సిట్ అధికారులకు తెలిపారు. దీంతో, ఈ ఫోన్‌లోని లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోల కోసం ఆపిల్ సర్వర్ లను యాక్సెస్ చేయాలని సిట్ భావిస్తుంది.
యాపిల్ సర్వర్ల యాక్సెస్ తోనే డేటా
సాధారణంగా, యాపిల్ ఐక్లౌజ్ లో మెసేజ్ లు, వాయిస్ రికార్డింగ్ లు, ఫొటోలు, వీడియోలు సహా మొత్తం సమాచారాన్ని నిల్వ చేస్తుంది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ లోని డేటా కావాలంటే ఐక్లౌడ్ ని నేరుగా యాక్సెస్ చేయడమే సిట్ అధికారుల ముందున్న ఏకైక మార్గం. దీంతో, సిట్ అధికారులకు యాపిల్ సర్వర్లు యాక్సెస్ చేసే అవకాశం వస్తే.. కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ కేసులో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి వాంగ్మూలమే సిట్ వద్ద ఉన్న బలమైన సాక్ష్యం.
జూన్ 6 వరకు కస్టడీలోనే రేవణ్ణ
ఏప్రిల్ నెలలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు కేసు పెట్టింది. ఆ తర్వాత పరిణామాల్లో ప్రజ్వల్ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లిపోయాడు. మే 31 విచారణకు హాజరవుతానని ప్రజ్వల్ వీడియో సందేశాన్ని పెట్టారు. దీంతో మహిళా పోలీసుల బృందం బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆయన్ని అరెస్టు చేసింది. వెంటనే ప్రజ్వల్‌ను బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్ 6 వరకు కస్టడీకి పంపింది