రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ..ఒడిశా సీఎం కీలక నిర్ణయం
బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన పట్నాయక్ తాను రెండు స్థానాల్లో బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. బోలంగీర్ జిల్లాలోని కాంతా బంజీ నియోజకవర్గం, గంజాం జిల్లాలోని హింజిలీ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2019లోనూ ఆయన బార్‌ఘర్ జిల్లాలోని హింజిలి, బిజేపూర్ సెగ్మెంట్లలో పోటీ చేయగా..రెండు సీట్లలో గెలుపొందారు. ఆ తర్వాత బిజేపూర్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం హింజిలీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. బీజేడీ తాజా జాబితాలో ఆరుగురు మహిళలు ఉన్నారు. దీంతో ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేడీ ఇప్పటివరకు 126 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాగా, దేశంలోని సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్న విషయం తెలిసిందే.