ప్రధానిపై కుట్ర దేశద్రోహం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రధానమంత్రిపై కుట్ర పన్నడం దేశద్రోహంతో సమానమని, అది తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించింది. అనాలోచితంగా ఎవరైనా ప్రధానిపై కుట్ర పన్నారని ఆరోపించకూడదని, అందుకు పక్కా ఆధారాలు ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జస్మీత్ సింగ్ పేర్కొన్నారు. న్యాయవాది జై అనంత్ డెహ్రాయ్‌పై బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ, సీనియర్ న్యాయవాది పినాకి మిశ్రా పరువు నష్టం దావా చేశారు. ప్రధాని మోడీపై పినాకి మిశ్రా కుట్ర పన్నారని ఆరోపిస్తూ డెహ్రాయ్ పలు ట్వీట్లు చేశారు. బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల తన పరువుకు నష్టం కలిగిందంటూ పినాకి మిశ్రా పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ప్రధానిపై కుట్ర చేయడం ఐపీసీ ప్రకారం దేశద్రోహం. మీరు ప్రధానిపై కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని నిరూపించాలి. లేదంటే మీపై నిషేధాజ్ఞలు జారీ చేస్తాం’’ అని కోర్టు అల్టిమేటం ఇచ్చింది. ఈ కేసులో విచారణ సందర్భంగా పినాకి మిశ్రా.. ‘‘నాకు బీజేపీతో,ప్రధానితో సైద్ధాంతిక అనుబంధం ఉంది. ప్రధానిపై నేను ఎప్పుడూ ఎలాంటి కుట్రలు చేయలేదు’’ అని స్పష్టం చేశారు. దీనికి డెహ్రాయ్ స్పందిస్తూ.. ‘‘పినాకి మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా మధ్య జరిగిన సంభాషణను నేను విన్నాను. అందులో ప్రధానిపై ఆరోపణలు చేయమని మొయిత్రాకు మిశ్రా సలహా ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. పినాకి మిశ్రాపై సీబీఐలో ఫిర్యాదు చేశానని,తన వద్ద ఆధారాలు ఉన్నాయని డెహ్రాయ్ చెప్పారు. దీంతో ఆధారాలు సమర్పించాలని డెహ్రాయ్‌ను కోర్టు ఆదేశించింది.ఈ కేసు తదుపరి విచారణలో డెహ్రాయ్ తన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించనున్నారు.