బెంగాల్ రైలు ప్రమాదంపై మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ 7 ప్రశ్నలు

స్లీపర్ కోచ్‌లను తగ్గించడం వల్ల రద్దీ పెరిగిపోయి టికెట్లు క్యాన్సిల్ అవుతుండటంపై ఖర్గె విచారం వ్యక్తం చేశారు

Update: 2024-06-18 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 10 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే నిర్వహణలో 'నేరపూరిత నిర్లక్ష్యం' పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలను సంధించారు.

బాలాసోర్‌లో ఘోర ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క కిలోమీటర్ కూడా కవచ్ సిస్టమ్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఖర్గె ప్రశ్నించారు. అలాగే, రైల్వేలో దాదాపు 3 లక్షల ఖాళీ పోస్టులు గత దశాబ్ద కాలంలో భర్తీ చేయకుండా ఎందుకు ఉన్నాయని అడిగారు. ఎన్‌సీఆర్‌బీ నివేదికను ఉటంకించిన ఖర్గె.. 2017-2021 మధ్య కాలంలో రైలు ప్రమాదాల కారణంగా లక్ష మంది మరణించారు. ఈ మరణాలకు జవాబుదారీగా ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మానవశక్తి కొరత వల్ల లోకో పైలట్లు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ఇది కూడా ప్రమాదాలకు కారణమని రైల్వే బోర్డు స్వయంగా అంగీకరించింది. అలాంటపుడు పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు? కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) సిఫారసుల పట్ల రైల్వే బోర్డు చూపిన నిర్లక్ష్యంపై విమర్శలను ప్రస్తావిస్తూ, సీఆర్ఎస్‌ను ఎందుకు బలోపేతం చేయలేదు? 'రాష్ట్రీయ రైల్ సురక్ష కోష్' ఆ నిధులను దారి మళ్లించారని, దానికోసం కేటాయించిన దాంట్లో 75 శాతం నిధులను ఎందుకు తగ్గించారు? ఆ డబ్బును రైల్వే అధికారులు అనవసర ఖర్చులు, సౌకర్యాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారు? అని ప్రశ్నించారు.

స్లీపర్ క్లాస్‌లో ప్రయాణ ఖర్చులు పెరగడం, స్లీపర్ కోచ్‌లను తగ్గించడం వల్ల రద్దీ పెరిగిపోయి టికెట్లు క్యాన్సిల్ అవుతుండటంపై ఖర్గె విచారం వ్యక్తం చేశారు. రైల్ కోచ్‌లను తగ్గించాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రమాదం ప్రత్యక్ష ఫలితమని ఖర్గె అన్నారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు మోడీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం ఆశ్చర్యంగా ఉందని ఖర్గె తెలిపారు. రైలు ప్రమాదం జరిగినప్పుడల్లా మోడీ ప్రభుత్వ రైల్వే మంత్రి కెమెరాల కంటే వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని, అంతా బాగానే ఉన్నట్టు ప్రవర్తిస్తారని ఖర్గె విమర్శించారు.  


Similar News