వీవీప్యాట్‌ల వినియోగంపై కాంగ్రెస్ ప్రచారాన్ని కొనసాగిస్తుంది: జైరాం రమేష్
ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు వీవీప్యాట్‌లను పూర్తిగా ఉపయోగించాలనే మా రాజకీయ ప్రచారం కొనసాగుతుందని ట్వీట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి వీవీప్యాట్‌లను ఎక్కువగా ఉపయోగించడంపై కాంగ్రెస్ తన రాజకీయ ప్రచారాన్ని కొనసాగిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. శుక్రవారం ఈవీఎంలలో పోలైన ఓట్లను పూర్తి క్రాస్ వెరిఫికేషన్ చేసేందుకు వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించాలనే అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన వీవీప్యాట్‌ల పిటిషన్ వెనుక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ లేదని జైరాం రమేష్ అన్నారు. అయినప్పటికీ, న్యాయమూర్తుల బెంచ్ తీర్పును గమనించాం. ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు వీవీప్యాట్‌లను పూర్తిగా ఉపయోగించాలనే మా రాజకీయ ప్రచారం కొనసాగుతుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వీవీప్యాట్‌ల పిటిషన్ వ్యవహారంలో శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఒక వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం మంచిది కాదని' అభిప్రాయపడింది. దానివల్ల అనవసర అనుమానాలకు దారి తీస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.