ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

Update: 2024-04-08 14:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ‘న్యాయ్ పత్ర’ పేరుతో తాము విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ‘ముస్లింలీగ్’ భావజాలాన్ని అద్దంపడుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొంది. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, రాజ్యసభ ఎంపీ ముకుల్‌ వాస్నిక్‌, పవన్ ఖేరా, గుర్దీప్ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం మధ్యాహ్నం నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. వారికి ఫిర్యాదు ప్రతులను అందజేశారు. ఎన్నికల ప్రచారంలోనూ సాయుధ బలగాలను కొనసాగించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందంటూ బీజేపీపై మరో ఫిర్యాదు చేశారు.

అన్ని పార్టీలు సమానమేనని చాటి చెప్పాలి : జైరామ్ రమేష్

‘‘మొత్తంగా ఆరు ఫిర్యాదులను ఈసీకి కాంగ్రెస్ ప్రతినిధి బృందం అందించింది. వాటిలో ప్రధాని మోడీపై చేసిన ఫిర్యాదులు రెండు ఉన్నాయి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ‘‘కాంగ్రెస్ ‘న్యాయ్‌పత్ర’ దేశాన్ని విభజించేదిగా, ముస్లింలీగ్ ఐడియాలజీని ప్రజలపై బలవంతంగా రుద్దేదిగా ఉందని ప్రధాని మోడీ కామెంట్స్ చేయడం పూర్తిగా అసంబద్ధం. ఈవిషయాన్నే ఈసీ అధికారులకు వివరించాం. అన్ని పార్టీలు సమానమే అని చాటి చెప్పాల్సిన తరుణం ఇదే. ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ ఉపేక్షించదని మేం భావిస్తున్నాం. అది స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేందుకు ఇదే తగిన తరుణం. మా ఫిర్యాదులపై ఈసీ తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. ఏప్రిల్ 6న(శనివారం) రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్రచార సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఓడిపోతామనే భయంతోనే ఆ అంశం తెరపైకి : ఖర్గే

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఫైర్ అయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు బ్రిటీష్ పాలకులు, ముస్లిం లీగ్‌ నాయకులకు మద్దతుగా నిలిచిన దాఖలాలు చరిత్రలో చాలా దొరుకుతాయని చెప్పారు. ‘‘ఓ వైపు స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే.. మరోవైపు తోటి భార‌తీయుల‌కు వ్య‌తిరేకంగా, బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా ఆర్ఎస్ఎస్ నాయకులు కుట్రలు పన్నారు’’ అని ఖర్గే కామెంట్ చేశారు. మోడీ-షాల రాజ‌కీయ పూర్వీకులు బ్రిటీష‌ర్లు, ముస్లిం లీగ్‌లకు మద్దతుదారులుగా వ్యవహరించే వారని ఆయన తెలిపారు. ముస్లిం లీగ్ వ్య‌వ‌హార శైలిలో నడుచుకుంటున్నది బీజేపీయే అని ఖర్గే పేర్కొన్నారు.ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్లు కూడా రావన్న భయంతోనే బీజేపీ నేతలు హిందూ-ముస్లిం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందనడానికి మోడీ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశయాలకు ప్రతిబింబం తమ న్యాయ్ పత్ర్ మేనిఫెస్టో అని ఖర్గే స్పష్టం చేశారు. మోడీ పదేళ్ల అన్యాయానికి ఈసారి తెరపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News