Goyal: స్టార్టప్ లపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ విమర్శలు.. గోయల్ వివరణ ఇదే..
భారత స్టార్టప్ (startups)లపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

దిశ, నేషనల్ బ్యూరో: భారత స్టార్టప్ (startups)లపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే, ఈ కామెంట్లపై తీవ్ర విమర్శలు రాగా.. ఆయన వాటిపై స్పందించారు. గోయల్ మాట్లాడుతూ.. ‘స్టార్టప్‌లపై నా మెసేజ్ సానుకూలంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలే వాటిని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇది వారి ప్రతికూల విధానాన్ని ప్రతిబింభిస్తోంది. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాలు దీనిపై అనవసరంగా వివాదాలు రేకెత్తిస్తున్నాయి. యువ భారతీయులు ఈ స్టార్టప్‌లపై ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని గోయల్ పేర్కొన్నారు.
స్పందించిన సీఈవోలు
మన స్టార్టప్‌లు ఐస్‌క్రీమ్‌లు, చిప్స్ తయారీ వద్దే ఆగిపోకుండా చైనా తరహాలో ఏఐ వంటి అంశాలపై దృష్టిసారించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను జెప్టో సీఈఓ అదిత్ పలిచా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ వంటి ప్రముఖులు తప్పుబట్టారు. ఉద్యోగాల సృష్టి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో జెప్టో విజయం సాధించిందని, భారత ఆవిష్కరణల్లో ఇది అద్భుతమని అదిత్ పలిచా పేర్కొన్నారు. ఇంజినీర్‌లు, టెక్నాలజిస్ట్‌లు సవాల్‌గా తీసుకోవాలని, విమర్శగా భావించకూడదని జోహో వెంబు అన్నారు. దేశీయ స్టార్టప్ లపై గోయల్ నమ్మకం ఉంచాలని, డీప్-టెక్ స్టార్టప్ లకు చేయుతనివ్వాలని మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు.